NTV Telugu Site icon

టీఆర్ఎస్‌కు ఓట్లేమీ తగ్గలేదు.. కుంగేదిలేదు.. పొంగేదిలేదు..

హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ నుంచి బరిలోకి దిగిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై 24 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆది నుంచి అన్నీ తానై నడించారు హరీష్‌రావు.. నోటిఫికేషన్‌ వెలువడకముందు నుంచి ఆ నియోజకవర్గంలో వరుస పర్యటనలు చేశారు.. కానీ, విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక, హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితంపై స్పందించిన మంత్రి హరీష్‌రావు.. ప్రజాతీర్పును శిర‌సావ‌హిస్తాం అని వెల్లడించారు..

హుజురాబాద్‌ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన ఓట‌ర్లంద‌రికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్‌రావు.. పార్టీ కోసం క‌ష్టప‌డ్డ కార్యక‌ర్తల‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేమీ తగ్గలేదన్నారు.. అయితే, దేశంలో ఎక్కడ‌లేనివిధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి పనిచేశాయని ఆరోపించారు.. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు కూడా చెబుతున్నారన్న ఆయన.. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావ‌డాన్ని రాష్ట్ర ప్రజలంతా గ‌మ‌నిస్తున్నారని కామెంట్ చేశారు. ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎన్నికలో ఓట‌మితో కుంగిపోదు.. గెలిచిన‌నాడు పొంగిపోలేదు. ఓడినా.. గెలిచిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజ‌ల ప‌క్షాన ఉండి ప‌నిచేస్తుందని స్పష్టం చేశారు హరీష్‌రావు.