పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు యావత్ సినీ పరిశ్రమ నివాళి అర్పిస్తోంది. శాండల్ వుడ్ కన్నీరు మున్నీరు అవుతోంది. పునీత్‌కి తెలుగు సినీ పరిశ్రమతో అనుబంధం వుంది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, హీరో శ్రీకాంత్, ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తదితరులు పునీత్ పార్థివ దేహాన్ని చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ కన్నీరు ఆపుకోలేకపోయారు. పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ ను గట్టిగా పట్టుకున్న చిరంజీవి, వెంకటేష్ బోరున విలపించారు. రాజ్ కుమార్ కుటుంబానికి, మెగాస్టార్ కుటుంబానికి సుమారు 40 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది.
రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు, చిరంజీవి కుటుంబ సభ్యులు ఫ్యామీలో ఫ్రెండ్స్. చిరంజీవి బెంగళూరు ఎప్పుడు వచ్చినా దాదాపుగా శివరాజ్ కుమార్ కచ్చితంగా ఆయన్ను కలుస్తారు. రాజ్‌కుమార్ హైదరాబాద్ వస్తే చిరంజీవి, ఇతర సినీ ప్రముఖుల్ని కలిసేవారు. పునీత్ రాజ్ కుమార్ పార్థీవ దేహం చూసిన వెంటనే చిరంజీవి కన్నీరు ఆపుకోలేకపోయారు. కొన్ని నిమిషాల పాటు చిరంజీవి అక్కడే మౌనంగా ఉండిపోవడం అక్కడ కనిపించింది. చిరుతో పాటు ఆలీ, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయి.