త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై ప్రజలు ఆసక్తి కబరుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఎవరు అధికారం చేజిక్కింకుంటారో.. వారిదే కేంద్రంలో అధికారం.. కాబట్టే ఆ రాష్ట్రం గురించిన చర్చ జోరుగా సాగుతోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకుంటామని బీజేపీ సర్కారు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, తదితర పార్టీలన్ని గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా పని చేసిన మాయవతి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించేందుకు రెడీ అవుతున్నారు. ఈక్రమంలోనే తాను గతంలో చేసిన తప్పులు మరోసారి చేయనని ప్రజలు తనకో మరో అవకాశం ఇవ్వాలని కోరుతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఈసారి యూపీలో త్రిముఖ పోటీ లేదంటే చతుర్ముఖ పోటీ తప్పదనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతంలో పొత్తులతో బరిలో నిలిచిన కాంగ్రెస్ సైతం ఈసారి ఒంటరిగానే బరిలో దిగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ చిన్నచితక పార్టీలతో కలిసి బరిలో నిలుస్తుంది. బీఎస్పీ మాత్రం పొత్తులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ప్రచారంలో మాత్రం దూసుకెళుతోంది. అన్ని పార్టీలకు ధీటుగా తాము అధికారంలోకి వస్తే ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగానే మాయవతి తాను గతంలో చేసిన తప్పులు ఎంతమాత్రం రిపీట్ చేసిదీ లేదని స్పష్టం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
బీఎస్పీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాయవతి చేసిన కొన్ని కార్యక్రమాలు విమర్శలకు తావిచ్చాయి. ముఖ్యంగా తమ పార్టీ గుర్తు ఏనుగు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం విగ్రహాలను ఊరురా ఏర్పాటు చేశారు. ప్రజాధనాన్ని ఆమె విగ్రహాల పేరిట దుర్వినియోగం చేశారనే ఆరోపణలను విపక్షాల నుంచి బలంగా ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతేకాకుండా మాఫియా, గుండాలకు ఆమె టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ ఆమెపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడంతో ఆమె అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. ఈనేపథ్యంలోనే ఆమె ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
విగ్రహాల కోసం నాటి ప్రభుత్వం ఖర్చు చేసిన ధనాన్ని మాయవతి నుంచి రాబట్టాలని ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఆమె తన వాదనను బలంగానే విన్పించారు. ప్రస్తుత యూపీ సర్కారు అయోధ్యలో ప్రభుత్వం 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోందని గుర్తు చేస్తున్నారు. వాళ్లు చేస్తే తప్పు కానప్పుడు మేము చేస్తే తప్పు ఎలా అవుతుందని ఆమె తన సుప్రీం కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా జవహర్ లాల్ నెహ్రూ.. ఇందిరా గాంధీ.. రాజీవ్ గాంధీ విగ్రహాలను ఏర్పాటు చేసిందన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా పేరొందిన సర్దార్ పటేల్ విగ్రహ నిర్మాణానికి కూడా బీజేపీ సర్కారు మూడువేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. అయోధ్యలో రాముడి ప్రతిమ కోసం ప్రభుత్వం రూ.200కోట్లను కేటాయించిదని తెలిపారు. అలాగే జయలలిత.. ఎన్టీఆర్.. వాజ్‌పేయ్.. వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. నాడు ఆమె వాదన కోర్టులో గెలిచిందిగానీ ప్రజల్లో మాత్రం ఆమెపై వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె అధికారం కోల్పోయారు.
అదేవిధంగా ఆమె హయాంలో మాఫియా, గుండాలకు టికెట్లకు ఇచ్చారనే అపవాదును ముట్టగట్టుకున్నారు. గత నాలుగున్నరలో యోగీ సర్కారు సైతం క్రిమినల్ కేసుల ఉన్నవారిని ఏరిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాయవతి సైతం ఈసారి ఎన్నికల్లో క్రిమినల్ ట్రాక్ రికార్డు ఉన్నవారికి టికెట్లు ఇచ్చేది లేదని తేల్చిపారేస్తున్నారు. అదేవిధంగా విగ్రహాల కోసం ప్రజాధనాన్ని వినియోగించనని స్పష్టం చేస్తున్నారు. గతం నుంచి తాను చాలా గుణపాఠాలు నేర్చుకున్నానని ఇలాంటి తప్పులను మరోసారి రిపీట్ కావని ప్రజలకు మాయవతి వివరిస్తున్నారు. దీంతో ఓటర్లు సైతం ఆమె పట్ల ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా మారిన మనిషి ప్రజల ముందు వస్తున్నానని మాయవతి చెబుతున్న మాటలను ప్రజలు ఏమేరకు విశ్వసించారనేది మాత్రం ఎన్నికల రిజల్ట్ వస్తేగానీ తెలియదు. అంతవరకు మనం కూడా వేచిచూడాల్సిందే..!