NTV Telugu Site icon

తెరపైకి మరోసారి మరియమ్మ లాకప్‌ డెత్‌ కేసు

దొంగతనం కేసులో పోలీసులు తీసుకెళ్లి కొట్టడంతో పోలీస్‌ స్టేషన్‌లోనే మరియమ్మ మృతి చెందింది. అయితే మరియమ్మ లాకప్‌ డెత్‌ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో పీయూసీఎల్ పిల్ పై సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. మరియమ్మ లాకప్ డెత్ సీబీఐకి అప్పగించదగిన కేసని హైకోర్టు అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అంతేకాకుండా మరియమ్మ మృతిపై హైకోర్టుకు విచారణ నివేదిక సమర్పించిన మెజిస్ట్రేట్ ను కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కు అప్పగించాలని ఏజీని ఆదేశించింది. బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు, మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు ఏజీ ప్రసాద్ తెలిపారు.

దీనిపై స్పందించిన హైకోర్టు.. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని వ్యాఖ్యానించింది. ఇతర ఆరోగ్య సమస్యలున్న మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలపడంతో.. రెండో పోస్టుమార్టం నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయని.. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది.

సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమన్న హైకోర్టు.. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి నోటీసులు జారీ చేసి విచారణ ఈనెల 22కి వాయిదా వేసింది.