సంచలనం సృష్టించిన పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడుతోంది. పంజాగుట్ట పాప హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. చిన్నారి మృతదేహాన్ని ఓ ఆటోలో నిందితులు తీసుకొచ్చినట్లు పోలీసులు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. మహిళతో పాటు మరో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించిన సంగతి తెలిసిందే.
నిందితులు బెంగళూరులో పాపని చంపి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు గా గుర్తించారు. పాప హత్య కేసు లో ముగ్గురి పాత్ర ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం అవుతోంది. బెంగళూరులో చంపేసిన పాప డెడ్ బాడీని బస్సులో హైదరాబాద్ పంజాగుట్ట తీసుకొచ్చారు ముగ్గురు. పంజాగుట్టలో నడుచుకుంటూ వచ్చి పాప మృతదేహాన్ని షాప్ ముందు వదిలివెళ్లింది ఓ మహిళ.
అనంతరం ఆ మహిళ పంజగుట్ట నుంచి మెహిదీపట్నం వైపు వెళ్ళినట్టుగా గుర్తించారు పోలీసులు. కడుపులో బలంగా తన్నడంతోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టంలో రిపోర్టులో వెల్లడయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పద మృతి కేసును పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని పీఎస్‌లకు బాలిక ఫొటో పంపించారు. సోషల్‌మీడియాలో కూడా పాప వివరాలు, ఫొటో షేర్ చేశారు. త్వరలోనే ఈ కేసులో అసలు విషయాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
