NTV Telugu Site icon

‘మా’లో మొదలైన లొల్లి; ఎన్నికల బరిలో లేనన్న కళ్యాణ్ రామ్!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతవరకూ ఏదీ రాలేదు. అయితే అది ఏ రోజైనా రావచ్చుననే అంతా భావిస్తున్నారు. ‘ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వార్మ్’ అన్నట్టుగా విలక్షణ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ను ప్రకటించేశారు. మరో వైపు మంచు విష్ణు తన తండ్రిని తోడ్కొని సినిమా పెద్దల్ని కలిసి వస్తున్నారు. అయితే ఇవాళ తన ప్యానల్ తరఫున నిలబడబోయే వారి పేర్లను ప్రకటించిన ప్రకాశ్ రాజ్ ఎవరు ఏ పదవికి పోటీ చేస్తారో మాత్రం చెప్పలేదు. బహుశా మిగిలిన ప్యానెల్స్ లో ఎవరెవరు ఏ యే పదవికి పోటీ పడతారో తెలుసుకుని ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే.. ఇక్కడ ఇంకో తిరకాసు ఉంది. ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ నుండి 27 మంది పేర్లను ప్రకటించారు.

అంతేకాదు… మరికొందరు సినీ ప్రముఖులూ తన ప్యానెల్ నుండి పోటీ చేస్తారని అన్నారు. నిజానికి ‘మా’ కార్యవర్గంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో కలిపి ఉండేది కేవలం 24 మంది మాత్రమే. సో… ప్రకాశ్ రాజ్ జాబితాలో ఉన్న అందరూ పోటీ చేసే ఆస్కారం లేదు. అందులో కొందరు తప్పుకోవాల్సింది.
ఇదిలా ఉంటే… ‘మా’ ఎన్నికల బరిలో ఇప్పటి వరకూ అనుకుంటున్న నాలుగు ప్యానెల్స్ లో రకరకాల వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. అలా నందమూరి కళ్యాణ్ రామ్ సైతం ‘మా’ ఎన్నికల్లో నిలబడతారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన అధికార ప్రతినిధి ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లను నమ్మవద్దని నందమూరి కళ్యాణ్‌ రామ్ ‘మా’ ఎన్నికల్లో నిలబడటం లేదని స్పష్టం చేశారు.