NTV Telugu Site icon

నేడే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. మధ్యాహ్నంలోపే తేలిపోనుంది..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని అనే ఉత్కంఠ నెలకొంది.. తెలంగాణ‌లో ఈ నెల 10వ తేదీన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే కాగా.. ఇవాళ ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు అధికారులు.. ఇప్పటికే లెక్కింపున‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్ నిర్వహించారు.. ఇక, ఆయా జిల్లా కేంద్రాల్లోనే కౌంటింగ్ జరగనుంది.. ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా.. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు పూర్తిస్థాయి ఫ‌లితాలు వెల్లడి అయ్యే అవ‌కాశం ఉందంటున్నారు.. ఇక, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండగా.. కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Read Also: డిసెంబర్‌ 14, మంగళవారం రాశిఫలాలు…

ఇక, 10వ తేదీన ఆయా నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌ను పరిశీలిస్తే.. ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో అత్యధికంగా 99.70 శాతం పోలింగ్ న‌మోదు అయ్యింది.. ఉమ్మడి మెద‌క్ జిల్లాలో 99.22 శాతం పోలింగ్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 97.01 శాతం, ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో 96.09 శాతం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం పోలింగ్‌ న‌మోదైంది. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో వంద శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.. మరోవైపు.. క‌రీంన‌గ‌ర్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, 10 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్. ర‌మ‌ణ‌, భానుప్రసాద్ రావు పోటీలో ఉన్నారు. ఖ‌మ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి.. టీఆర్ఎస్ నుంచి తాత మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి పోటీలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి దండె విఠ‌ల్, స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణి బ‌రిలో ఉన్నారు. ఉమ్మడి మెద‌క్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జ‌ర‌గ‌గా, టీఆర్ఎస్ నుంచి యాద‌వ‌రెడ్డి, కాంగ్రెస్ త‌ర‌పున తూర్పు నిర్మల‌, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మ‌ల్లారెడ్డి బ‌రిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు. ఈ స్థానానికి టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు న‌గేష్‌, ల‌క్ష్మయ్య, వెంక‌టేశ్వర్లు, ఈర్పుల శ్రీశైలం, బెజ్జం సైదులు, కొర్ర రామ్‌సింగ్ పోటీలో ఉన్నారు.. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో.. అన్ని స్థానాల్లో విజయం మాదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు.. మరి విపక్షాల సత్తా చాటుతాయా? అధికార పార్టీ ఖాతాలోకే అన్ని ఎమ్మెల్సీ స్థానాలు వెళ్లిపోతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.