NTV Telugu Site icon

‘లగాన్’ వర్సెస్ ‘గదర్ – ఏక్ ప్రేమ్ కథ’

ఒకే రోజు ఇద్దరు పేరున్న స్టార్ హీరోస్ సినిమాలు విడుదలై, రెండు చిత్రాలు విజయం సాధిస్తే చిత్రసీమకు ఓ పండగే అని చెప్పాలి. అలాంటి పండగలను ఇద్దరు స్టార్ హీరోలు బాలీవుడ్ కు రెండు సార్లు అందించారు. ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎవరంటే ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్. ఈ ఇద్దరు హీరోలు తొలిసారి 1990లో ఒకే రోజున పోటీ పడి సినీఫ్యాన్స్ ను మురిపించారు. తరువాత పదకొండు సంవత్సరాలకు 2001లో మరోమారు ఒకే రోజు భారీ చిత్రాలతో సందడి చేసి, ఇద్దరూ ఘనవిజయాలను సాధించారు. ఈ రెండు పోటీలకు జూన్ మాసం వేదిక కావడం విశేషం. 1990 జూన్ 22న సన్నీ డియోల్ ‘ఘాయల్’తో ఆమిర్ ఖాన్ ‘దిల్’ ఢీ కొంది. సన్నీ చిత్రం మాస్ ను విశేషంగా ఆకట్టుకుంటే, ఆమిర్ సినిమా యూత్ ను మురిపించింది. ఆ సినిమాల విజయంతో అప్పట్లో బాలీవుడ్ సంబరం చేసుకుంది. పదకొండేళ్ళ తరువాత అంతకంటే మించిన సందడిని సన్నీ డియోల్, ఆమిర్ ఖాన్ అందించడం మరింత విశేషం. 2001 జూన్ 15న ఆమిర్ ఖాన్ ‘లగాన్’, సన్నీ డియోల్ ‘గదర్ -ఏక్ ప్రేమ్ కథ’ విడుదలయ్యాయి. రెండు చిత్రాలు అనూహ్య విజయం సాధించాయి.

‘లగాన్’, ‘గదర్’ రెండు చిత్రాలలోనూ దేశభక్తి నేపథ్యం చోటు చేసుకోవడం విశేషం! మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు వాతావరణంలో ‘లగాన్’ తెరకెక్కింది. స్వరాజ్యం వచ్చిన తరువాత దేశవిభజన సమయంలో సాగిన కొన్ని అంశాల నేపథ్యంలో ‘గదర్’ రూపొందింది. అశుతోష్ గోవారికర్ ‘లగాన్’ కోసం మెగాఫోన్ పట్టుకోగా, అనిల్ శర్మ దర్శకత్వంలో ‘గదర్-ఏక్ ప్రేమ్ కథ’ తెరకెక్కింది. ఈ ఇద్దరు దర్శకులకు ఈ చిత్రాలు మరచిపోలేని, మరపురాని విజయాలను అందించాయి. ఆ తరువాత విచిత్రంగా ఈ దర్శకులిద్దరూ ఆ స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు.

‘లగాన్’ కథాకమామిషు…

‘లగాన్’ అంటే పన్ను. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు అన్యాయంగా విధించే పన్నును కట్టలేమని ఓ గ్రామప్రజలు తమ ప్రాంతపు రాజుకు విన్నవించుకుంటారు. బ్రిటిష్ వారికి సామంతునిగా ఉన్న సదరు రాజు తన నిస్సహాయతను వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలో ఆంగ్లేయులు ఆ ఊరి ప్రజలను హేళన చేస్తారు. అదే సందర్బంలో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న అక్కడి బ్రిటిష్ అధికారి మాటలు ఆ గ్రామానికి చెందిన భువన్ ను ఉక్రోశానికి గురి చేస్తాయి. చేతనైతే, తమను క్రికెట్ లో ఓడిస్తే, తాము ఆ ఊరు వదలి వెళ్తామని బ్రిటిష్ అధికారి సవాల్ చేస్తాడు. అతని సవాల్ ను స్వీకరించి, భువన్ ఓ క్రికెట్ జట్టును తయారు చేయడం, చివరకు క్రికెట్ లో చివరి బంతికి సిక్స్ కొట్టి విజయం సాధించడం జరుగుతాయి. మాటకు కట్టుబడి బ్రిటిష్ వారు ఆ ప్రాంతం విడిచిపోవడంతో కథ ముగుస్తుంది.

విశేషాలు

‘లగాన్’ చిత్రానికి ఆమిర్ ఖాన్ నిర్మాత. ఎక్కడా రాజీపడకుండా ఆమిర్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఎ.ఆర్.రహమాన్ సంగీతం ప్రాణం పోసింది. ఇందులోని పాటలన్నీ ఆ రోజుల్లో జనాన్ని విశేషంగా అలరించాయి. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా జనం ముందు నిలచింది. ఈ సినిమా ఘనవిజయంతో మళ్ళీ టాప్ స్టార్స్ తో వాయిస్ ఓవర్ చెప్పించాలనే కాన్సెప్ట్ ఊపందుకుంది. ఈ చిత్ర నిర్మాణానికి అప్పట్లోనే 25 కోట్ల రూపాయలు వెచ్చించారు. బాక్సాఫీస్ ద్వారా, ఆడియో అమ్మకాలు, శాటిలైట్, ఓవర్సీస్ ద్వారా ఈ చిత్రం అప్పట్లోనే దాదాపు 75 కోట్ల రూపాయలు పోగేసింది. ఈ చిత్రానికి ‘బెస్ట్ ఫారెన్ మూవీ’ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ లభించింది. ‘మదర్ ఇండియా, సలామ్ బాంబే’ తరువాత ఆస్కార్ నామినేషన్ సంపాదించిన భారతీయ చిత్రంగా ‘లగాన్’ నిలచిపోయింది. ఇక ‘లగాన్’ చిత్రం ద్వారా గ్రేసీ సింగ్ నాయికగా మంచి పేరు సంపాదించింది.

‘గదర్’ సంగతులు…

‘గదర్- ఏక్ ప్రేమ్ కథ’ విషయానికి వస్తే, భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటించిన రోజునే భారత్, పాకిస్థాన్ – రెండుగా విడిపోయింది దేశం. ఆ సమయంలో పాకిస్థాన్ లో స్థిరపడాలని ఆశించిన వారు అటువైపు, అక్కడ నుండి భారత్ లో నివసించాలని కోరుకున్నవారు ఇటు వైపు రైళ్ళలో ప్రయాణించారు. అలా పాకిస్థాన్ పై మనసు పారేసుకున్న ఓ ముస్లిమ్ అధికారి తన భార్యాబిడ్డలతో ట్రెయిన్ ఎక్కుతాడు. కానీ, అతని కూతురు సకీనా ట్రెయిన్ ను అందుకోలేకపోతుంది. ఆ సమయంలో అక్కడా, ఇక్కడా మతకలహాలు సైతం తలెత్తి ఉంటాయి. కొందరు మతోన్మాదులు ఆ అమ్మాయిని చంపాలని చూస్తారు. ఆమె చదివే కాలేజ్ హాస్టల్ కు సరుకులు రవాణా చేసే ట్రక్కు డ్రైవర్ తారా సింగ్ వచ్చి రక్షిస్తాడు. ఆమెను పాకిస్థాన్ పంపాలని ప్రయత్నిస్తాడు. కానీ, విఫలమవుతాడు. తారా సింగ్ పై సకీనా మనసు పారేసుకుంటుంది. ఇద్దరూ భార్యాభర్తలవుతారు. ఓ పిల్లాడు కూడా పుడతాడు. పాకిస్థాన్ లో సకీనా తండ్రి పెద్ద అధికారిగా ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. పేపర్ ద్వారా ఆయన ఫోటోను చూపి, ఆయన నంబర్ సంపాదించి సకీనా మాట్లాడుతుంది. కూతురు బతికే ఉందని తెలుసుకున్న సకీనా తండ్రి వచ్చి, ఆమెను మాత్రమే తీసుకుపోతాడు. తారాసింగ్ ను, అతని కొడుకును వదిలేస్తాడు. తల్లిని బిడ్డను కలపాలన్న ఉద్దేశంతో తారాసింగ్ పాకిస్థాన్ కు వెళ్లి పలు కష్టాలు పడతాడు. చివరకు సకీనా, బిడ్డ కోసం ఇంటి నుండి పారిపోయి వస్తుంది. అది చూసిన అక్కడి వారి ముందు ఆ ముస్లిమ్ అధికారి తలకొట్టేసినట్టవుతుంది. దాంతో సకీనా, తారాసింగ్ పెళ్ళికి అంగీకరిస్తాడు. అయితే ఆ సమయంలో ఆ ముస్లిమ్ అధికారి స్వయంగా ‘భారత్’ నశించాలి అని చెప్పమని తారాసింగ్ ను కోరతాడు. అందుకు అంగీకరించడు తారాసింగ్. అక్కడ నుంచీ అంతమందిలోనూ తన భార్యను, కొడుకును కాపాడుకుంటూ వారిని చితకబాదుతూ, తారాసింగ్ భారత్ వైపు పరుగు తీస్తాడు. చివరకు ఆ ముస్లిమ్ అధికారి నానా విధాల తారాసింగ్ ను చంపాలని చూస్తాడు. కానీ, చివరలో తారాసింగ్ కు, సకీనా పై ఉన్న ప్రేమను గుర్తించి, క్షమించమని వేడుకోవడంతో కథ ముగుస్తుంది.

రాబడిలో ‘గదర్’ పైచేయి…

‘లగాన్’తో పోలిస్తే, ‘గదర్-ఏక్ ప్రేమ్ కథ’లో పలు అంశాలు తక్కువేనని చెప్పాలి. విడుదలకు ముందే ‘లగాన్’ ఆడియో పెద్ద హిట్టయింది. ‘గదర్’లోనూ ఉత్తమ్ సింగ్ స్వరకల్పనలో రూపొందిన కొన్ని పాటలు అలరించినా, రహమాన్ స్వరకేళి ముందు అవి అంతగా నిలవలేకపోయాయి. ఇక ‘గదర్’ చిత్ర నిర్మాణ వ్యయం రూ.19 కోట్ల రూపాయలే. కానీ, థియేటర్స్ ద్వారా, ఆడియో, శాటిలైట్ రైట్స్, విదేశాలలో ప్రదర్శన అన్నీ కలిపి రూ.130 కోట్ల దాకా ఈ చిత్రం పోగేసి, అందరినీ ఆశ్చర్య పరచింది. భారతదేశంలో మ్యూజికల్ హిట్ ‘హమ్ ఆప్ కే హై కౌన్’ తరువాత అన్ని టిక్కెట్స్ తెగిన చిత్రంగా ‘గదర్’ అప్పట్లో చరిత్ర సృష్టించింది. విదేశాలలోని భారతీయులను ‘లగాన్’ కంటే మిన్నగా ‘గదర్’ ఆకట్టుకుంది. ఇందులో సన్నీ డియోల్ సరసన అమిషా పటేల్ నాయికగా నటించి మురిపించింది.

ఒకే రోజున విడుదలై ఇంతటి ఘనవిజయాలను చవిచూసిన స్టార్ మూవీస్ మళ్ళీ బాలీవుడ్ ను ఇప్పటి దాకా పలకరించలేదు.