భారత్‌లో కరోనా కట్టడిలో కేరళ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.. దీని వెనుక సీఎం పినరయి విజయన్‌తో పాటు.. ఇప్పటి వరకు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కేకే శైలజ కృషి ఎంతో ఉంది.. దానికి తగ్గట్టుగానే ఆమెకు వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి, ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.. అరుదైన గౌరవాన్ని కల్పించాయి. అయితే, తాజాగా జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు శైలజా టీచర్.. మత్తన్నూర్ నియోజకవర్గం నుంచి ఏకంగా 60 వేల మెజార్టీతో తిరుగులేని విజయాన్ని నమోదు చేశారు. కానీ, ఆమెకు.. ఈ సారి కేబినెట్‌లో మాత్రం చోటు దక్కలేదు.. రెండోసారి వరుసగా కేరళలో అధికారంలోకి వచ్చిన ఎల్‌డీఎఫ్ కూటమి ప్రభుత్వంలో కేకే శైలజకు మంత్రి పదవి అందకుండా పోయినట్టు తెలుస్తోంది.
ఈ నెల 20వ తేదీన కేరళ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.. అదే రోజు కొత్త కేబినెట్ ప్రమాణం చేయనున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే మంత్రుల ఎంపిక కూడా జరిగిపోయింది.. 21 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరనున్నట్లు ఎల్డీఎఫ్ ప్రకటించగా.. ఇందులో 11మంది కొత్త వారికి మంత్రులుగా అవకాశం కల్పించారు. అయితే, మొదట ఆ జాబితాలో కేకే శైలజ పేరు కూడా ఉంది. ఆరోగ్య మంత్రిగానే కొనసాగుతారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసిన క్రమంలో శైలజకు కేబినెట్‌లో స్థానం దక్కలేదని తెలుస్తోంది.. శైలజ టీచర్ గా పేరుపొందిన ఆమె.. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు.. కోవిడ్ కట్టడి చర్యలకు గాను.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా అభినందనలు అందుకున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆరోగ్యశాఖ ఆమెకె అప్పగిస్తారని ప్రచారం జరిగినా.. లెఫ్ట్ సర్కార్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ప్రమాణస్వీకారానికి మరికొంత సమయం ఉన్నందున.. ఆలోపు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది వేచిచూడాలి. మరోవైపు.. ఎల్‌డీఎఫ్ సర్కార్‌పై ప్రతిపక్షాలు దాడికి దిగుతున్నాయి… సమర్థవంతంగా పనిచేసిన కేకే శైలజకు లెఫ్ట్ సర్కార్ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నిస్తున్నాయి.