కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి రెబెల్స్ బెడతతో సతమతమవుతోంది. మాజీ సీఎం జగదీష్ షెట్టర్ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ బీజేపీకి ఇచ్చిన రెండు రోజుల గడువు శనివారంతో ముగియడంతో, షెట్టర్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. టికెట్ ఇవ్వకుంటే తన అనుచరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటానని షెట్టర్ స్పష్టం చేశారు. షెట్టర్ కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో బలమైన నాయకుడు. ఆ ప్రాంతం కాషాయ పార్టీకి కంచుకోటగా ఉంది. నాలుగు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు.
Also Read:T-hub: టీ-హబ్.. సూపర్బ్. సాంకేతిక రంగంలో సాటిలేనిది
ఈ సారి ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం షెట్టర్ ని ఆదేశించింది. ఈ మేరకు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఈశ్వరప్ప, హాలాడి శ్రీనివాస్ శెట్టి తదితరులు ఆయన్ను కోరుతున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జరిగిన చర్చల్లో రెండు రోజుల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరినట్లు షెట్టర్ వెల్లడించారు. ఒకవేళ బీజేపీ టికెట్ ఇవ్వకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. హైకమాండ్ చర్యను ఖండిస్తూ హుబ్బళ్లి-ధార్వాడ్ సిటీ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉన్న 16 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు.
Also Read:YS Viveka Case: ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు..!
బెళగావి జిల్లాలోని అథని నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ ఆయనకు టికెట్ ప్రకటించి, ఆయన గౌరవాన్ని, స్థాయిని అలాగే ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం కర్ణాటక బీజేపీ విభాగానికి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
షెట్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీలో ఉంటారా? లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. అయితే, బీజేపీలో జరుగుతున్న అంతర్గత కలహాలను విపక్ష కాంగ్రెస్ నిశితంగా గమనిస్తోంది.