NTV Telugu Site icon

కనికట్టు చేసే కరీనా అందం!

(సెప్టెంబర్ 21న కరీనా కపూర్ పుట్టినరోజు)

కపూర్ ఖాన్ దాన్ లో నాల్గవ తరం తార కరీనా కపూర్. నాలుగు పదులు దాటుతున్నా, నాజూకు షోకులతో నవయువకుల గుండెల్లో గుబులు రేపుతూనే ఉంది. పటౌడీ వారి కోడలుగా మారిన తరువాత కూడా కరీనా కపూర్ తన దరికి చేరిన పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తూ మురిపిస్తూనే ఉంది. ఈ నాటికీ కరీనా అందం కుర్రకారుకు బంధం వేస్తూనే ఉండడం ఆమె పతి దేవుడు సైఫ్‌ అలీ ఖాన్ సైతం గర్వంగా భావిస్తున్నాడు. కరీనా, సైఫ్ కాపురం సజావుగా సాగుతోంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా కపూర్ ఇప్పటికీ ఆకట్టుకుంటూ ఉండడమే విశేషం!

కరీనా కపూర్ 1980 సెప్టెంబర్ 21న జన్మించింది. రాజ్ కపూర్ పెద్ద కొడుకు రణదీర్ కపూర్, నటి బబిత ఆమె కన్నవారు. తాతల నాటి నుంచీ పేరుకు పోయిన నటనతో కరీనా కపూర్ పరుగులు తీస్తూ చిత్రసీమలో అడుగు పెట్టింది. అభిషేక్ బచ్చన్ తొలి చిత్రం ‘రెఫ్యూజీ’తోనే కరీనా సైతం చిత్రసీమలో అడుగుపెట్టడం విశేషం. ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. షారుఖ్‌ ఖాన్ చారిత్రక చిత్రం ‘అశోక’లో కీలక పాత్ర పోషించినా, ఆ సినిమా సైతం చేదురుచినే చూపించింది. కరీనా పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో ‘కభీ ఖుషి కభీ ఘమ్’ ఆమె అందానికి తగ్గ విజయాన్ని అందించింది. ఆ తరువాత నుంచీ కరీనా కపూర్ కాల్ షీట్స్ కు డిమాండ్ పెరిగింది. ‘ఛమేలీ’లో వేశ్య పాత్రలో కరీనా అభినయం అందరినీ ఆకట్టుకుంది. గోవింద్ నిహలానీ ‘దేవ్’లోనూ మంచి మార్కులే సంపాదించింది. “ఓంకార, జబ్ వీ మెట్, కుర్బాన, వీ ఆర్ ఫ్యామిలీ, ఉడ్తా పంజాబ్” వంటి చిత్రాలతో నటిగా జేజేలు అందుకుంది. ఇక ఆమిర్ ఖాన్ తో నటించిన ‘3 ఇడియట్స్’, సల్మాన్ ఖాన్ సరసన అలరించిన “బాడీ గార్డ్, బజ్రంగీ భాయిజాన్” చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
షాహిద్ కపూర్ హిట్ పెయిర్ గా పేరు సంపాదించింది కరీనా. వారిద్దరూ కలసి నటించిన “ఫిదా, 36 చీనా టౌన్, జబ్ వీ మెట్, చుప్ చాప్ కే” వంటి చిత్రాలలో నటించారు. కరీనా, షాహిద్ ప్రేమయాత్ర పెళ్ళి దాకా వెళ్తుందని భావించారు. అయితే అనూహ్యంగా పటౌడీ వారి అబ్బాయి సైఫ్ అలీ ఖాన్ రెండో భార్యగా కరీనా కపూర్ మారింది.

‘దేవ్’లో “జబ్ నహీ ఆయే థే తుమ్…” పాట పాడి అలరించింది కరీనా. ‘తషాన్’లోనూ గాయనిగా అలరించింది. షారుఖ్ ఖాన్ ‘డాన్’, ‘క్యా లవ్ స్టోరీ హై’, ‘రౌడీ రాథోడ్’లో “జింతాతా జితా తా…” , ‘దబంఘ్-2’లో “ఫెవికాల్…” సాంగ్స్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది.

నటనతో పాటు రచనలోనూ కరీనా కపూర్ చేయి చేసుకుంది. ఆమె రాసిన న్యూట్రిషన్ గైడ్స్ జనాన్ని భలేగా మురిపించాయి. స్టేజ్ షోస్ తోనూ కరీనా అలరించారు. రేడియోలో ఓ కార్యక్రమానికి హోస్ట్ గానూ ఆమె వ్యవహరించారు. బాలికలకు సముచిత విద్య కోసం ‘యూనిసెఫ్’తో కలసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ తో ‘లాల్ సింగ్ ఛద్దా’లో కరీనా కపూర్ నటిస్తోంది. ఆమె మరిన్ని చిత్రాలతో జనాన్ని ఆకట్టుకుంటారని ఆశిద్దాం.