ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ఆయా జిల్లాల కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు.
ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎస్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. బాధితులకు రూ.1000 చొప్పున అందించాలని ఆధికారులను ఆదేశించారు. బాధితులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముంపు ప్రభావిత ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు.