సీఆర్డీఏ రద్దు, 3 రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిర్విఘ్నంగా పూర్తైంది. ఈ సందర్భంగా తిరుపతిలో అమరావతి రైతులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానం టూ దేవస్థానం సభ సక్సెస్ అయ్యిందని, మా ముఖ్యమంత్రి కూడా మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారని అన్నారు. అంతేకాకుండా మళ్లీ బిల్లు పెట్టాలంటే పార్లమెంట్ లో కూడా బిల్ పాస్ కావాలని, అమిత్ షా తిరుపతిలో అడుగు పెట్టగానే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానికి అమిత్ షా ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి జగన్ ఏనాడూ అమరావతికి వ్యతిరేకమని చెప్పలేదని, ఆయనతో ఉండే మంత్రులు ప్రచారం చేస్తున్నారంతే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడాలని కోర్టుకు చెప్పిన ప్రభుత్వం… స్టేక్ హోల్టర్స్ అయిన రైతులతో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో అడుగు పెడితే ఏదో చేస్తారని రిపోర్ట్ అందిందని అయినా పోలీసుల సహకారంతో సభకు హాజరయ్యానని ఆయన అన్నారు. ఆర్థిక సంక్షోభం వల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని పార్లమెంట్ లో కోరానన్నారు. దాదాపు అదే విషయాలను మా వైసీపీ ఎంపీలు కూడా ప్రస్తావించారని ఆయన వెల్లడించారు.