పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ సెలబ్రేషన్ లాంటిది. అయితే కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల పెళ్లిళ్లు వాయిదా పడటమో లేదా రద్దు కావడమో జరగుతుంటాయి. గత రెండేళ్ల కాలంలో కరోనా కారణంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదాలు పడ్డాయి. మరికొన్ని రద్దయ్యాయి. ఇప్పుడు ఒమిక్రాన్ ముప్పు ముంచుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా వివాహాలు రద్దయితే అటు ఆడపెళ్లి వారికి, ఇటు మగపెళ్లి వారికి చాలా ఆర్థిక నష్టం చేకూరుతుంది. అయితే ఇకపై ఆర్థికంగా నష్టపోకుండా పెళ్లిళ్లపైనా పలు కంపెనీలు బీమాను అందిస్తున్నాయి. ఈ మేరకు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ రూపంలో పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి.
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ముంబైలో 144 సెక్షన్
పెళ్లిళ్లు చేసుకునే వారి కోసం నాలుగు రకాల వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఎంత బీమా చేశారన్న విషయంపైనే మీ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ఆధారపడి ఉంటుంది. బీమా మొత్తంలో 0.7 శాతం నుంచి 2 శాతం వరకు ప్రీమియం రూపంలో కంపెనీలు ఛార్జ్ చేస్తాయి. వెడ్డింగ్‌లపై రూ.10 లక్షల వరకు బీమాను కంపెనీలు అందిస్తున్నాయి. ఒకవేళ మీరు రూ.10 లక్షల వెడ్డింగ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే… మీరు రూ. 7,500 నుంచి రూ. 15,000 వరకు ప్రీమియం చెల్లించాలి. ఒకవేళ అనుకోని కారణాల వల్ల పెళ్లి వేడుక రద్దయిన సందర్భంలో ఎదుర్కొనే భారీ నష్టాలను ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ నాలుగు కేటగిరీలలో కవర్ అవుతుంది. లయబులిటీస్ కవరేజ్, క్యాన్సిలేషన్ కవరేజ్, ఆస్తుల నష్టం, వ్యక్తిగత ప్రమాదం కేటగిరీల కింద ఇన్సూరెన్స్ లభిస్తుంది.
