Site icon NTV Telugu

జాతి చరిత్రలో పంద్రాగస్టు వేడుకలు ఒక విశిష్ట ఘట్టం : సీఎం కేసీఆర్

గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జెండా ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్‌. ఇది భారత స్వాతంత్ర్య అమృత ఉత్సవాలు జరుగుతున్న సందర్భమని… జాతి చరిత్రలో ఒక విశిష్ట ఘట్టమని వివరించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదని తెలిపారు. దేశ విముక్తి కోసం తృణ ప్రాయంగా తమ ప్రాణాలను త్యాగం చేసిన మహానీయులందరికీ వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నానని కేసీఆర్‌ పేర్కొన్నారు.

Read Also : న్యూ లుక్ లో పవర్ స్టార్… పిక్ వైరల్

ఈ సందర్భంగా 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ ప్రస్థానం లోని వెలుగు నీడల్నిమనందరం వివేచించుకోవాలని… మనం సాధించింది ఏమిటి ? ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు చేసుకోవాలని తెలిపారు. ఒకవైపున దేశం అనేక రంగాలలో కొంతమేరకు పురోగతిని సాధించిందని… అదేసమయంలో నేటికీ చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాలకోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోదోయి, సాధించిన దానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకుంటే పొరపాటోయి” అని మహాకవి శ్రీ శ్రీ రాసిన పాటనూ ఇప్పటికీ మనం అన్వయించుకో వలసిన అవసరం ఉందని సీఎం కేసీఆర్‌ వివరించారు. మరింత నిబద్ధత, నిజాయితీ. సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారతప్రజలు పునరంకితం కావాలని కోరుకుంటున్నానన్నారు.

Exit mobile version