దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసారన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత.. పాకిస్థాన్ కూడా నిరంతరం బెదిరింపులు జారీ చేస్తోంది. బయటకు హెచ్చరికలు చేసినా.. నిజానికి పాకిస్థాన్ లోలోపల వణుకుతోంది. ఎందుకంటే.. పాకిస్థాన్ భారతదేశ సైనిక శక్తి ముందు మోకరిల్లక తప్పదు. భారత్‌తో పోల్చుకుంటే పాకిస్థాన్ జనాభా పరంగా, సైనిక పరంగా, ఆయుధాల పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అంతర్జాతీయ సహకారం పరంగా అన్ని రంగాల్లో వెనకబడే ఉంది.
అడుక్కతినే స్థాయిలో పాకిస్థాన్..
ఇప్పటికే అడుక్కుతినే స్థాయిలో ఉన్న పాకిస్తాన్.. భారత్‌తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందనే విషయం తెలిసినా.. ఆ దేశం కవ్వింపు చర్యలకు దిగుతూనే ఉంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి.. రోజు గడవాలంటే విదేశాలు, విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల వద్ద చేతులు చాచి అడుక్కుంటోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది. మరోవైపు.. అంతర్గతంగా పాక్‌లో అనేక రాజకీయ, వేర్పాటువాద సవాళ్లు ఉన్నాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య కూడా సఖ్యత లేదు. ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్.. ఇటీవలి కాలంలో పాక్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో భారత్‌తో యుద్ధం అంటే పాకిస్తాన్ ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితే ఉంటుంది.
భారత్ శక్తి ముందు పాక్ ఎంత?
గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం.. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాల జాబితాలో భారతదేశం నాల్గవ స్థానంలో ఉంది. ఈ అంశంలో మాత్రం పాకిస్థాన్ పరిస్థితి నిరంతరం దిగజారుతూనే ఉంది. 2023లో పాకిస్థాన్ 7వ స్థానంలో నిలిచింది. 2024 వచ్చే సరికి 9వ స్థానానికి పడిపోయింది. 2025 లో పాకిస్థాన్ టాప్ 10 నుంచి కనుమరుగైంది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం.. ప్రస్తుతం పాక్ 12వ స్థానానికి దిగజారింది. కాగా.. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 60 వేర్వేరు పారామితులపై దేశాల బలాన్ని పరీక్షిస్తుంది. ప్రస్తుతం అమెరికా అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో రష్యా రెండవ స్థానంలో ఉండగా.. చైనా మూడవ స్థానాకి చేరుకుంది. ఈ మూడు అగ్రరాజ్యాల తర్వాత.. భారతదేశం తదుపరి స్థానంలో ఉంది.
సైనికుల అంశంలో సైతం భారత్ టాప్..
భారత సైన్యంలో 14,55,550 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. రిజర్వ్ సైనికుల సంఖ్య 11,55,000. కాగా పాకిస్థాన్‌లో 6 లక్షల 54 వేల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. 5 లక్షల 50 వేల మంది రిజర్వ్ సైనికులు పని చేస్తున్నారు. పారామిలిటరీ దళాల సంఖ్యను పరిశీలిస్తే.. భారతదేశంలో 25 లక్షల 27 వేల మంది సైనికులు ఉండగా.. పాకిస్థాన్ వద్ద 5 లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి. భారతదేశంలో 4,201 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద కేవలం 2,627 మాత్రమే ఉన్నాయి. భారతదేశంలో T-90 భీష్మ, అర్జున్ ట్యాంకులు, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన హైటెక్ వాహనాలు, పినాక రాకెట్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. భారతదేశంలో 1,48,594 సాయుధ వాహనాలు ఉన్నాయి. పాకిస్థాన్ కంటే మూడు రెట్లు ఎక్కువ. భారతదేశం వద్ద బోఫోర్స్, హోవిట్జర్ తుపాకులు ఉండగా…. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ను ఓడించింది ఇవే.
వైమానిక దళంలో భారత్ భేష్..
భారత వైమానిక దళం వద్ద 513 జెట్‌లతో సహా 2,229 విమానాలు ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద మొత్తం 1,399 విమానాలు ఉండగా.. వాటిలో 328 యుద్ధ విమానాలు కలిగి ఉంది. హెలికాప్టర్ల విషయంలో భారతదేశం ముందుంది. భారత్ వద్ద 80 అటాక్ హెలికాప్టర్లు ఉండగా.. పాకిస్థాన్ కేవలం 57 మాత్రమే కలిగి ఉంది. భారత వైమానిక దళం వద్ద రాఫెల్ ఫైటర్ జెట్‌లు, సుఖోయ్ SU-30MKI, మిరాజ్-2000, MiG-29 ఫైటర్ జెట్‌లు ఉన్నాయి. ఇది బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలతో అమర్చారు. కాగా.. పాకిస్థాన్ వద్ద JF-17 థండర్, A-16, మిరాజ్ వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి.
భారత నావికాదళం ముందు పాకిస్థాన్ నావికాదళం చాలా బలహీనంగా కనిపిస్తోంది. యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో పాక్ భారత్ కంటే వెనుకబడి ఉంది. భారత్‌లో మొత్తం 293 నావికాదళ నౌకలు, 18 జలాంతర్గాములు ఉండగా.. పాకిస్థాన్ దాదాపు 121 నావికాదళ నౌకలు, 8 జలాంతర్గాములు కలిగి ఉంది. మన వద్ద రెండు విమాన వాహక నౌకలు కూడా ఉన్నాయి. పాక్ వద్ద ఒక్కటి కూడా లేదు. భారతదేశం వద్ద 13 డ్రోన్లు ఉండగా.. పాక్ వద్ద దీని సంఖ్య శూన్యం. భారత నావికాదళంలో మొత్తం 1,42,252 మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. ఇవన్నీ చూసి కూడా పాకిస్థాన్ ఇప్పుడు ముందుకు వచ్చి యుద్ధం చేస్తే.. ఆ దేశానికి మిగిలేది చిప్ప మాత్రమే..
భారత్-పాక్ యుద్ధానికి అవకాశం ఉందా?
పహల్గామ్ ఉగ్రదాడిని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. అంతేకాకుండా ఈ దాడి చేసిన ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి మట్టిలో కలిపేస్తామని.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర హెచ్చరికలు చేశారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇలాగే తీవ్రంగా స్పందించారు. నేరుగా యుద్ధమార్గాన్నే ఎంచుకోకుండా భారత్ పలు దౌత్య, ఆర్థిక పరంగా చర్యలు తీసుకుంటోంది.