NTV Telugu Site icon

గోల్డ్‌ మెడల్‌ అందుకే గెల‌వ‌లేక‌పోయా.. ఫైనల్‌లో ఓటమిపై భ‌వీనా ప‌టేల్‌

పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్‌లో కొత్త రికార్డు నెలకొల్పారు భారత్‌ అథ్లెట్ భ‌వీనా ప‌టేల్‌.. తొలిసారి పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్‌లో భారత్‌ ఒక్క పతకం సాధించకపోగా.. అనూహ్యంగా ఫైనల్‌లో అడుగుపెట్టిన భవీనా.. ఫైనల్‌లో ఓడినా.. ఇండియాకు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించారు.. ఇక, భవీనా పటేల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. భవీనా చరిత్ర లిఖించింది.. ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అభినందలు తెలపగా.. పారాలింపిక్స్‌లో భవీనాబెన్‌ సాధించిన విజయం దేశానికి గర్వకారణం అని.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. మరోవైపు.. గోల్డ్ మెడల్‌ చేజారడంపై స్పందించారు భవీనా..

రజతం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడిన భవీనా పటేల్.. ఇవాళ నేను కాస్త నెర్వస్‌గా ఫీల‌య్యాను.. అందుకే 100 శాతం ప్రద‌ర్శన ఇవ్వలేక‌పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, త‌ర్వాతి టోర్నీలో దీనిని స‌రిదిద్దుకుంటానని వెల్లడించారు.. ఓ అథ్లెట్ త‌న 100 శాతం ప్రద‌ర్శన ఇచ్చారంటే ఇక వాళ్లు ఓడిపోయినట్లు కాదు అని నేను ఎప్పుడూ న‌మ్ముతాను అని తెలిపారు. ఓ త‌లుపు మూసుకుంటే మ‌రో త‌లుపు త‌న కోసం తెరుచుకూనే ఉంటుందనే విషయాన్ని తాను న‌మ్ముతాన‌ని.. స‌మ‌స్యల‌ను సానుకూలంగా చూడ‌టం వ‌ల్ల క‌ఠోరంగా శ్రమించే ధైర్యాన్ని త‌న‌కు ఇస్తుంద‌ని.. భారత్‌కు తిరిగి రాగానే ఏషియ‌న్ గేమ్స్‌, కామ‌న్వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమ‌వుతాన‌ని తెలిపారు భ‌నీనా పటేల్.