ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో తెలంగాణ సర్కార్ మళ్లీ నిబంధనలు కఠినం చేస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. లేదంటే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. అంతేకాదు… కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. గతేడాది మాస్క్ నిబంధన ఉల్లంఘించిన 3 లక్షల 26 వేల 758 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు.
ఈ లెక్కన రాష్ట్రంలో జరిమానా ఉల్లంఘనల కింద ఇప్పటివరకు 131 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటి వరకు హెల్మెట్ లేకపోతే… ఫోటోలు తీసి ఫైన్లు వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు మాస్క్ లేకుండా వాహనాలు నడిపేవారికి చలాన్లు వేస్తున్నారు. ఫోటోతో సహా మొబైల్స్‌కు మెస్సేజ్‌లు పెడుతున్నారు. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రూపాయల మాస్క్ పెట్టుకోకపోతే… వెయ్యి రూపాయల ఫైన్ వేస్తున్న పోలీసులు… పబ్లిక్ ప్లేస్‌లో ఉచితంగా మాస్క్‌లను అందుబాటులో ఉంచొచ్చు కదా అంటున్నారు.
