Site icon NTV Telugu

భారత మొట్టమొదటిగా సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌.. సాధించిన ఘ‌న‌త‌లు ఇవే !

భారత్‌ ఓ నికార్సైన దేశభక్తుణ్ని కోల్పోయింది. దేశం కోసం నాలుగు దశాబ్దాలకు పైగా అనేక పోరాటాలు చేసిన వీరుణ్ని పోగొట్టుకుంది. చివరి రోజు వరకు విధినిర్వహణలోనే గడిపిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ దేశానికి చేసిన సేవలు అసామాన్యం. 1978లో మొదలైన ఆయన కెరీర్‌ నేటివరకు అంచెలంచెలుగా ఎదగటంలో అకుంఠిత దీక్ష, అంతులేని క్రమశిక్షణ ఉన్నాయి.

భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. 2019 డిసెంబర్‌ 30నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు.
భారత్‌కు తొలి సీడీఎస్‌ గా ఆయనే దేశంలో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి. లద్దాఖ్‌ సంక్షోభ సమయంలో ఆయన త్రివిధ దళాలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉన్నారు. మూడు దళాలు బీజింగ్‌ను సమష్టిగా ఎదుర్కొనే వ్యూహంలో ఆయన పాత్ర చాలా కీలకం. భారత్‌ రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణలకు ఆయన మార్గదర్శి. ప్రభుత్వం భారత్‌లో వేర్వేరు చోట్ల త్రివిధ దళాలకు ఉన్న 17 కమాండ్లను కలిపి ఇంటిగ్రేటెడ్‌ థియేటర్‌ కమాండ్లుగా ఏర్పాటు చేసే బాధ్యత ఆయనదే. 1978 డిసెంబర్‌లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ 2017 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 వరకు ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.నాలుగు దశాబ్దాలుగా ఆర్మీలో ఉన్న రావత్‌… పరమ్‌ విశిష్ట్‌ సేవా మెడల్, ఉత్తం యుధ్ సేవా పతకం, అతి విశిష్ట్‌ సేవా మెడల్, యుధ్ సేవా పతకం, విశిష్ట్ సేవా మెడల్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు.

ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌ షా మరియు జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ తరువాత గూర్ఖా బ్రిగేడ్ నుండి ఆర్మీ స్టాఫ్ చీఫ్ అయిన మూడవ అధికారి బిపిన్‌ రావత్‌. 31 డిసెంబర్ 2019 న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాల తొలి అధిపతిగా బిపిన్ రావ‌త్ ప‌ద‌వీకాలం 2022, జ‌న‌వ‌రితో ముగియ‌నుంది.

సాధారణంగా ఆర్మీ అధికారుల రిటైర్‌మెంట్ వయసు 62 సంవత్సరాలుగా ఉండేది. కానీ బిపిన్ రావత్‌ను సీడీఎస్ చీఫ్‌గా నియమించడం కోసం 65 ఏళ్లకు పెంచారు. డిసెంబర్ 1978లో ఆర్మీలో చేరిన బిపిన్ రావత్ తన తండ్రి పనిచేసిన 5వ బెటాలియన్‌లోనే సేవలు అందించారు. 42 ఏళ్లపాటు ఆర్మీలో పనిచేసిన బిపిన్.. బ్రిగేడ్ కమాండర్‌గా, జనరల్ ఆఫీసర్ కమాండ్ ఇన్ చీఫ్, జనరల్ స్టాఫ్ ఆఫీసర్, కల్నల్ మిలిటరీ సెక్రటరీ, డిప్యూటీ మిలిటరీ సెక్రటరీ, సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, ఆర్మీ స్టాఫ్‌కు వైస్ చీఫ్‌గా పనిచేశారు. అయితే, త్రివిధ దళాలకు వేర్వేరు అధిపతులు ఉండగా.. వీరి ముగ్గురిని సమన్వయం చేసేలా మరో అధికారిని నియమించాలని 1980ల్లో జనరల్ కేవీ కృష్ణారావు ప్రతిపాదించారు. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో చాలా మంది సైనికులు, సీనియర్ అధికారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీడీఎస్ ఏర్పాటుతో త్రివిధ దళాలు, ప్రభుత్వం మధ్య సమన్వయం మరింతగా పెరుగుతుందని భావించారు. త్రివిధ దళాలకు అధిపతిగా ఒక వ్యక్తిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చిన తర్వాత.. దాదాపు అందరు నాయకులకు ముందుగా తట్టిన పేరు బిపిన్ రావత్.

రక్షణ మంత్రికి ముఖ్య సైనిక సలహాదారు హోదాలో త్రివిధ దళాలకు సంబంధించిన వ్యవహారాలు ఆయన పరిధిలో ఉంటాయి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ , డిఫెన్స్ ప్లానింగ్ లాంటి కీలకమైన రక్షణ శాఖ సంస్థల్లో ఆయనకు చోటు ఉంటుంది. త్రివిధ దళాల్లా సీడీఎస్ వ్యక్తిగతంగా కమాండ్ చేసే దళాలు ఏవీ ఉండవు.
త్రివిధ దళాల అధిపతులకు ఆదేశాలు గానీ, ఎలాంటి సైనికాదేశాలు గానీ సీడీఎస్ ఇవ్వలేరు. త్రివిధ దళాల అధిపతులకు ఆయన పై అధికారి కాదు. వారితో సమానమైన హోదానే సీడీఎస్‌ది కూడా. రక్షణ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కు కార్యదర్శిగా ఉంటారు. రక్షణ శాఖలో ఇది ఐదో విభాగం. మిగతా దళాల అధిపతుల్లాగే సీడీఎస్‌కు జీతభత్యాలు ఉంటాయి. అయితే, త్రివిధ దళాల అధిపతుల పదవీవిరమణ వయసు 62 ఏళ్లు కాగా, సీడీఎస్ పదవీవిరమణ వయసు 65 ఏళ్లు ఉంటుంది.

బిపిన్ రావత్ 1958 లో ఉత్తరాఖండ్ లోని పౌరిలో రాజపుత్ కుటుంబంలో బిపిన్ రావత్ జన్మించారు. బిపిన్ రావత్ పూర్తి పేరు బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్. రావత్‌ కుటుంబం దశాబ్దాలుగా భారత సైన్యంలో పనిచేస్తోంది. రావత్‌ తండ్రి లక్ష్మణ్ సింగ్ రావత్ లెఫ్టినెంట్ జనరల్ గా పదవీ విరమణ పొందారు.ఉత్తరకాశీ మాజీ ఎమ్మెల్యే కిషన్ సింగ్ పర్మార్ కూతురే బిపిన్ రావత్ తల్లి.

రావత్ డెహ్రాడూన్లోని కేంబ్రియన్ హాల్ స్కూల్, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్ లో చదువుకున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్‌ వాస్లామరియు డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో చేరారు. అక్కడ రావత్ కు స్వోర్డ్ ఆఫ్ ఆనర్ లభించింది. డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ డిగ్రీ పొందారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి మేనేజ్‌మెంట్, కంప్యూటర్ స్టడీస్‌లో డిప్లొమా పొందారు.
సైనిక-మీడియా వ్యూహాత్మక అధ్యయనాలపై చేసిన పరిశోధనకు, చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం ఆయనకు పీహెచ్‌ డి ఇచ్చింది.

దేశ తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్‌గా రావత్‌ యూనిఫాం మీద త్రివిధ దళాలకు చెందిన చిహ్నాలు ఉంటాయి.త్రివిధ దళాలకు సంబంధించి.. రక్షణ మంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారుట్రైనింగ్, ఆపరేషన్స్, సహకార సేవలు, కమ్యూనికేషన్స్‌, రిపేర్, మెయింటెనెన్స్ మొదలైన అంశాల్లో త్రివిధ దళాలను సమన్వయం చేసుకుంటూ భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తున్నారు బిపిన్ రావత్‌. తమిళనాడులోని కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ కూలిన ఘటనలో జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు.

2015లో నాగాలాండ్ లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన రావత్..ఇప్పుడు మాత్రం సేఫ్ గా తిరిగిరాలేకపోయారు. 40 ఏళ్లుగా దేశ రక్షణలో సేవలందించిన బిపిన్ రావత్ మృతి పట్ల ప్రధాని మోదీ,రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు, ప్రముఖులు, త్రివిధ దళాలకు చెందిన అధికారులు విచారం వ్యక్తం చేశారు. దేశ రక్షణలో ఏళ్ల పాటు ఆయన అందించిన సేవలను కొనియాడారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక సహా అందులోని మొత్తం 13మంది మరణించారు.

Exit mobile version