NTV Telugu Site icon

విజయం సాధించిన భారత్… 2-1 తో ఆధిక్యంలోకి కోహ్లీసేన

ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గవ టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. ఉత్కంఠంగా సాగిన ఈ చివరి రోజు ఆటలో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసారు. ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కోహ్లీ(50), శార్దుల్(57) అర్ధశతకాలు చేయడంతో 191 పరుగులు చేసి మొదటి రోజే ఆల్ ఔట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆతిథ్య జట్టు 290 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ లో 99 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.

అనంతరం… రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు మంచి శుభారంభం లభించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(46) పరుగులు చేయగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(127) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అలాగే దానికి పంత్(50), శార్దుల్(60) అర్ధశతకాలు తోడవడంతో 466 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది టీంఇండియా. దాంతో 367 పరుగుల భారీ లక్ష్యంతో నిన్న తమ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండా 77 పరుగులు చేసి నాలుగో రోజు ఆటను ముగించింది.

ఇక నేడు చివరి రోజు ఆట ప్రారంభ సమయంలో విజయానికి 290 పరుగులు ఇంగ్లాండ్ జట్టుకు… 10 వికెట్లు భారత జట్టుకు కావాల్సి ఉంది. అయితే ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరు అర్ధశతకాలు చేసి జట్టుకు విజయం వైపుకు తీసుకెళ్తుండగా శార్దుల్ మొదటి వికెట్ ను భారత్ కు అందించాడు. అనంతరం రెండో సెషన్ లో బుమ్రా, జడేజా బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ ఆటగాళ్లు పెవిలియన్ దారి పట్టారు. అయితే చివరి సెషన్ లో భారత్ కు రెండు వికెట్లు అవసరం ఉండగా ఉమేష్ యాదవ్ వారిని ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 210 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్ 157 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్ లో భారత్ 2-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది.