దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరారు. స్వల్ప అనారోగ్యం వల్లే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే రజనీకాంత్ ఆస్పత్రిలో చేరడంతో ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఆరోగ్యంపై చెన్నైలోని కావేరి ఆస్పత్రి శుక్రవారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
Read Also: కన్నడ పవర్‌స్టార్ గొప్పతనం ఇదే… కళ్లను దానం చేసిన పునీత్
కాగా రజనీకాంత్‌కు తల తిరుగుతుండటంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని అందుకే చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో గురువారం చేరారని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో వివరించారు. రజనీకాంత్‌ను నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలించిందని, ఆయనకు కరోటిడ్ ఆర్టెరీ రీవాస్కులరైజేషన్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆయనకు రీవాస్కులరైజేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని పేర్కొన్నారు. మరికొన్నిరోజుల్లో రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని కావేరి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.
