తిరుపతి జలదిగ్భందంలో చిక్కుకుంది. రోడ్లు కాలువల్లా మారాయి. కాలనీలు కుంటలను తలపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా వరదే..! రెండు రోజులుగా వరద నీటిలోనే మగ్గుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. తిరుపతి అతలాకుతలమైంది. కొండ పైనుంచి వచ్చిన వరద ప్రవాహం తిరుపతిని ముంచేసింది. జడివాన దెబ్బకు చిగురుటాకులా వణికిపోయింది.ఇప్పటికీ నలువైపులనుంచి వరద వస్తూనే ఉంది. మోకాలి లోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.కాలువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి కాలువలు సరిపోవడం లేదు.
దాంతో ఉప్పొంగిపారుతున్నాయి. తిరుపతి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ మునిగాయి. శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోకి వరద చేరింది. రైల్వే అండర్‌బ్రిడ్జిల వద్ద భారీగా నీరు చేరడంతో మూసేసి ట్రాఫిక్ మళ్లించారు. ముంపు కాలనీల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు మునిగాయి. తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటు స్వర్ణముఖి నది నీటి ప్రవాహం పెరగడంతో రైల్వే లైన్ దెబ్బతింది. రేణిగుంట – చెన్నై రైల్వే లైన్ తొమ్మిది గoడ్ల వారధి దగ్గర నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో రేణిగుంట రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళవలసిన పలు రైళ్లను, వయా గూడూరు మీదుగా తరలించారు. భారీ వర్షానికి గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయాయి. దీంతో తిరుపతి రూరల్ నుంచి అర్బన్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.
