Site icon NTV Telugu

హుజురాబాద్‌లో భారీ ఓటింగ్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

న్నికల్లో భారీ పోలింగ్ జరగడం అభ్యర్ధుల విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. 2018 ఎన్నిక‌ల సంద‌ర్భంగా హుజురాబాద్‌లో 2,26,000 పైచిలుకు ఓట్లు ఉండేవి. తాజాగా ఉపఎన్నికలో కొత్తగా నమోదు చేసుకున్నవారికి ఓటు హ‌క్కు క‌ల్పించారు. దీంతో ప‌ది వేల ఓట్లు పెరిగి… ఆ సంఖ్య ఇప్పుడు 2,36,873కు చేరింది. హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం ఐదు మండ‌లాలున్నాయి. ఇల్లంతకుంట మండ‌లంలో మిగ‌తా మండ‌లాల కంటే త‌క్కువ ఓట్లు ఉన్నాయి. ఈ మండ‌లంలో కేవ‌లం 24,799 మంది ఉండ‌గా.. హుజురాబాద్ మండ‌లంలో అత్యధికంగా 61,673 ఓట్లు ఉన్నాయి. పోలింగ్ సరళిని బట్టి 90 శాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.

పోటీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్‌గానే వుంది. అయితే, అధికార పార్టీ విద్యార్థి సంఘం నేత గెల్లు శ్రీనివాస్‌ని బరిలో నిలిపింది. బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల పోటీలో వున్నారు. మిగతా వారి సంగతి అలా వుంచితే.. ఈటలకు ఈ ఉప ఎన్నికలో విజయం సాధించడం అత్యవసరం. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రతిష్టాత్మకం. అందుకే పోలింగ్ శాతం పెరగడానికి తమవంతుగా ఎవరికి వారు ప్రయత్నాలు చేశారు.

2018 అసెంబ్లీ, 2019 లోక్‌‌సభ ఎన్నికల్లో హుజూరాబాద్​ నుంచి కాంగ్రెస్​ 50 వేలకు పైగా ఓట్లు సాధించింది. పీసీసీ చీఫ్​గా రేవంత్​రెడ్డి నియామకంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే తపన కనిపిస్తోంది. సీనియర్లు కూడా ప్రచారం చేయడంతో కాంగ్రెస్ ఓట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంపై కొంత పట్టు ఉన్న ఎమ్మెల్సీ జీవన్‍రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‍బాబు, పీసీపీ మాజీ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ పొన్నం ప్రభాకర్‍ వంటివారు ప్రచారం చేశారు.

ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు ధీమాగా వున్నారు. పోలింగ్ పెరగడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. అయితే, టీఆర్ఎస్ నేతలు మాత్రం పోలింగ్ బూత్‌లకు వచ్చిన ఓటర్లు తమ పాలనకు పాజిటివ్ సంకేతాలు అంటున్నారు. యువత కూడా భారీగా ఓటు వేయడానికి తరలి రావడం రెండు పార్టీలకు సెంటిమెంట్‌గా మారింది.

Exit mobile version