దేశంలో సామాన్యులకు పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్న వేళ.. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో వినియోగదారులకు తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం కలిగింది. అయితే భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతాయని ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా వెల్లడించారు. 2023 నాటికి లీటర్ పెట్రోల్ ధర మరో రూ.100 పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. చమురు అనేది విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదని… దాని ధరలను నియంత్రించడం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండదని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణం కరోనా సంక్షోభమేనన్నారు.
Read Also: గుడ్‌న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి గల కారణాలను కూడా నరేంద్ర తనేజా విశ్లేషించారు. చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీలను పెంచుతుందని.. ఎప్పుడైతే చమురు ధరలు పెరుగుతాయో అప్పుడు ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం మాములు విషయమేనని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చమురు ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తే వినియోగదారులకు ఉపశమనం కలగడమే కాకుండా పారదర్శకత ఉంటుందని నరేంద్ర తనేజా అభిప్రాయపడ్డారు.
