NTV Telugu Site icon

ఇది తాత్కాలికమే.. మాట తప్పితే మళ్లీ ఉద్యమం..!

కేంద్ర ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా స్పందించడంతో ఏడాదికి పైగా సాగిన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించాయి రైతు సంఘాలు.. ఈ నెల 11న సింఘూ సరిహద్దును రైతులు ఖాళీయనున్నారు.. 11వ తేదీన రైతుల విజయోత్సవాలతో ఆందోళన విరమించాలనే నిర్ణయానికి వచ్చారు.. అయితే, ఆందోళన విరమణ తాత్కాలికమే.. ఇది పూర్తి విర‌మ‌ణ కాదు అంటూ స్పష్టం చేశారు సంయుక్త కిసాన్ మోర్చా నేత గురునామ్ సింగ్ చౌరానీ.. అన్ని డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా ఉండడంతో.. ఆందోళన విరమిస్తున్నామని.. జ‌న‌వ‌రి 15వ తేదీన మ‌రోసారి స‌మావేశమ‌వుతామ‌ని వెల్లడించారు.

Read Also: ప్రాజెక్టుల కోసం అదనపు సిబ్బంది నియామకం..! సీఎం ఆదేశాలు

ప్రస్తుతానికి ప్రభుత్వం త‌మ‌కు కొన్ని హామీల‌ను ఇచ్చింద‌ని, అందుకే త‌మ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రక‌టించామని.. ఆ హామీల‌ను నెర‌వేర్చని ప‌క్షంలో మ‌రోసారి ఉద్యమం తప్పదని హెచ్చరించారు రైతు సంఘాల నేతలు.. ఈ విషయాన్నే రైతు నేత బ‌ల్వీర్ రాజేవాల్ స్పష్టం చేశారు.. ప్రస్తుతానికైతే సింఘూ బార్డర్‌లోని టెంట్లను తొలగిస్తాం.. త‌మ త‌మ స్వస్థలాల‌కు వెళ్లడానికి సిద్ధం అవుతున్నామని పేర్కొన్నారు.