(సెప్టెంబర్ 28న పూరి జగన్నాథ్ పుట్టినరోజు)
ప్రస్తుతం తెలుగు దర్శకుల్లో స్పీడున్నోడు ఎవరంటే పూరి జగన్నాథ్ పేరే చెబుతారు. ఈ తరం డైరెక్టర్స్ లో అతి తక్కువ సమయంలో క్వాలిటీ చూపిస్తూ సినిమాలు రూపొందించడంలో తాను మేటినని నిరూపించుకున్నారు పూరి జగన్నాథ్. మొదటి నుంచీ పూరి జగన్నాథ్ ఆలోచనా సరళి భిన్నంగా ఉండేది. ఆయన చిత్రాల్లోని ప్రధాన పాత్రలు సైతం విచిత్రంగా ఆకట్టుకొనేవి. అందువల్లే పూరి జగన్నాథ్ అనగానే వైవిధ్యమైన దర్శకుడు అనే పేరు సంపాదించారు. తొలి చిత్రం బద్రి
లోనే తన సత్తా ఏమిటో చాటుకున్నారు పూరి. ఆ తరువాత అదిరిపోయే హిట్సూ అందించారు. ఆపై బెదిరేలా చేసిన ఫట్సూ చూపించారు. ఏది చేసినా అందులో తనదైన బాణీ మాత్రం పలికించారు పూరి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో విజయ్ దేవర కొండ హీరోగా లైగర్
తెరకెక్కిస్తున్నారు పూరి. ఈ చిత్రంతో మళ్ళీ డైనమిక్ డైరెక్టర్
అన్న తన పేరును నిలుపుకొనే ప్రయత్నంలో ఉన్నారాయన.
పూరి జగన్నాథ్ తొలి చిత్రం బద్రి
జనం ముందు నిలచి అప్పుడే 21 సంవత్సరాలయింది. అయినా ఈ నాటికీ పూరి జగన్నాథ్ తన ప్రతి చిత్రాన్నీ మొదటి సినిమాగా భావించి తెరకెక్కిస్తున్నారు. జయాపజయాలకు అతీతంగా పూరి సినిమా ప్రస్థానం సాగుతోంది. ఇప్పటికీ జనం పూరి జగన్నాథ్ సినిమా అనగానే అందులో ఏదో ఒక వైవిధ్యం ఉంటుందని భావిస్తున్నారు. పూరి జగన్నాథ్ రెండో సినిమా బాచీ
బాల్చీ తన్నేసినా, మూడో చిత్రం కన్నడ సినిమా యువరాజ
తో విజయం సాధించారు. తన నాలుగవ సినిమా ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం
తో పూరి జగన్నాథ్ తన మార్కేమిటో స్పష్టంగా చూపించారు. ఈ సినిమాతో రవితేజ స్టార్ హీరో అయిపోయాడు. రవితేజతో వరుసగా ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
వంటి విజయాలు చూశారు పూరి. దాంతో స్టార్ హీరో నాగార్జునను శివమణి
లో డైరెక్ట్ చేసి, విజయం సంపాదించారు పూరి. జూనియర్ యన్టీఆర్ తో తెరకెక్కించిన ఆంధ్రావాలా
ఆడలేదు. ఆ తరువాత వచ్చిన పూరి చిత్రాలు వన్ ఫోర్ త్రీ, సూపర్
కూడా మురిపించలేక పోయాయి. కొందరు పూరి పని అయిపోయిందనీ భావించారు. అప్పుడు కొట్టాడు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే హిట్. అదే మహేశ్ బాబుతో పూరి తెరకెక్కించిన పోకిరి
. ఈ సినిమా అనేక కేంద్రాలలో వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు, తరిగిపోని చెరిగిపోని రికార్డులు నెలకొల్పింది. ఆ తరువాత అల్లు అర్జున్ తో పూరి తెరకెక్కించిన దేశముదురు
అప్పటికి బన్నీ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలచింది. రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత
ను రూపొందించిందీ పూరియే. తరువాత తెరకెక్కిన పూరి జగన్నాథ్ చిత్రాలేవీ పోకిరి
స్థాయి విజయాన్ని మూటకట్టుకోలేక పోయాయి.
పూరి జగన్నాథ్ మాత్రం పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు. తన పోకిరి
హీరో మహేశ్ తో తీసిన బిజినెస్ మేన్
, తన తొలి చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన కెమెరామెన్ గంగతో రాంబాబు
, తిరుగులేని మాస్ హీరో బాలకృష్ణతో రూపొందించిన పైసా వసూల్
అంతగా మురిపించలేకపోయాయి. ప్రభాస్ తో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్
సైతం అలరించలేకపోయాయి. జూనియర్ యన్టీఆర్ తో తొలి సినిమా ఫ్లాప్ ఇచ్చినా, రెండో చిత్రం టెంపర్
తో ఓ డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నారు పూరి. దాని తరువాత మళ్ళీ మామూలే ఫ్లాపులు పలకరించాయి. ఆ పై రామ్ తో ఇస్మార్ట్ శంకర్
తీసి మళ్ళీ జనాన్ని ఆశ్చర్య పరిచారు. ఈ సినిమా రామ్ కెరీర్ లోబిగ్ హిట్ గా నిలచింది. ఇలా కెరీర్ లో పలు ఎత్తులు పల్లాలు చూసిన పూరి జగన్నాథ్ రాబోయే లైగర్
తో ఎలాంటి విజయం సాధిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి లైగర్
ఎప్పుడు జనం ముందు నిలుస్తాడో, వారి మనసులు ఏ తీరున గెలుస్తాడో చూడాలి.