తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే భయం భయంగా వుంది. బయటకు రాలేక, జీవనం గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. భారీ వర్షాల కారణంగా చివరి మజిలీకి తిప్పలు తప్పడంలేదు. చెన్నై లో చనిపోయిన వ్యక్తిని ట్రాక్టరు ద్వారా తీసుకెళుతున్నారు కుటుంబ సభ్యులు.
సౌత్ చెన్నైలో చోటు చేసుకున్న ఘటన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ వర్షాల కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో మరణించిన కుటుంబసభ్యుడిని ట్రాక్టర్‌లో తీసికెళుతున్న ఘటన అందరినీ కలిచి వేసింది. మోకాళ్ళలోతు నీళ్ళలో పాడె మోసే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. పార్ధివదేహాలను ఖననం చేయడానికి కూడా చోటు దొరకడం లేదు. కట్టెలు దొరక్కపోవడంతో అంత్యక్రియలకు ఇబ్బందులు పడుతున్నారు.
