NTV Telugu Site icon

గిలిగింతలు పెట్టిన ధర్మవరపు హాస్యం!

(సెప్టెంబర్ 20న ధర్మవరపు సుబ్రహ్మణ్యం జయంతి)

తెరపై ధర్మవరపు సుబ్రహ్మణ్యం కనిపించగానే ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. తాను నటించిన ప్రతి చిత్రంలోనూ ఏదో ఓ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఆయన నవ్వులు పూయించారు. ఆయన నవ్వుల నటనకు నంది అవార్డులూ లభించాయి. బుల్లితెరపైనా తన సంతకం చేస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ‘తోకలేని పిట్ట’తో దర్శకునిగానూ నవ్వులు పూయించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘానికి అధ్యక్షునిగానూ వ్యవహరించారు. ‘శోభన్ బాబు రింగు’ అంటూ నుదుటన జుత్తును రింగులా చేసుకొని ధర్మవరపు పూయించిన నవ్వులు తెలుగువారు మరచిపోలేరు.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20న ప్రకాశం జిల్లా కొమ్మినేనివారి పాలెం గ్రామంలో జన్మించారు. ప్రభుత్వోద్యోగిగా ఉన్నారు. ఆ సమయంలోనే నాటకాలు వేశారు, దర్శకత్వం వహించారు. ఆ అనుభవంతో బుల్లితెరపై ‘ఆనందో బ్రహ్మ’ నవ్వుల కార్యక్రమం నిర్వహించారు. సుబ్రహ్మణ్యం పేరు మారుమోగడం చూసిన జంధ్యాల తన ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో అవకాశం కల్పించారు. ఆ తరువాత నుంచీ చిత్రసీమలో తనదైన బాణీ పలికిస్తూ సాగారు ధర్మవరపు. ఈ నాటి ప్రముఖ రచయిత కోన వెంకట్, సినిమా రంగంలో అడుగు పెట్టి ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘తోకలేని పిట్ట’ చిత్రం నిర్మించారు. 2004లో ‘యజ్ఞం’ తోనూ, 2010లో ‘ఆలస్యం అమృతం’తోనూ ధర్మవరపు సుబ్రహ్మణ్యంకు ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డులు లభించాయి.

ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, ఆ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రాగానే ధర్మవరపును ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సంఘం అధ్యక్షునిగా చేశారు. వైయస్ జగన్ ‘సాక్షి టీవీ’లోనూ ధర్మవరపు నిర్వహించిన ‘డింగ్ డాంగ్’ కార్యక్రమం భలేగా ఆకట్టుకుంది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం పంచిన నవ్వులు ఈ నాటికీ జనానికి గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి.