NTV Telugu Site icon

సైబర్ దొంగలు.. మాజీ సైనికుడి డబ్బుల్ని వదల్లేదు!

కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరినీ వదలడం లేదు. మాజీ సైనికుడు క్యాన్సర్ చికిత్స కోసం దాచుకున్న డబ్బులను సైబర్ నేరస్థులు కొట్టేశారు.చెక్ బుక్ కోసం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన తీరును క్యాష్ చేసుకున్న సైబర్ నేరస్థులు చికిత్స కోసం మూడు బ్యాంక్ ల్లో దాచుకున్న 2 లక్షల 30 వేల రూపాయలను దోచేశారు. ఇక్కడ భార్యతో సహా కనిపిస్తున్న ఈయన పెద్దబోయిన భిక్షపతి. మాజీ సైనికుడు దేశ సేవకోసం బార్డర్‌లో సేవలందించారు. విజయవంతంగా సేవలు చేసిన ఇటీవలనే పదవీ విరమణ చేసిన తర్వాత స్వంత ప్రాంతం అయిన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఇటీవలనే క్యాన్సర్ బారినపడ్డాడు. క్యాన్సర్ శస్త్ర చికిత్సకోసం మూడు బ్యాంకు ఖాతాలో రెండు లక్షల 30 వేలు దాచుకున్నారు పెద్దబోయిన భిక్షపతి. SBI బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు, HDFC బ్యాంకు ఖాతాలో 95 వేల రూపాయలు, ఇండియన్ బ్యాంకు ఖాతాలో 35 వేల రూపాయలను దాచుకున్నాడు. మరో వారం రోజులలో శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా SBI బ్యాంకు లో చెక్ బుక్ కోసం అప్లయ్ చేయగా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేశారు. ఆ ఫోన్ పెట్టేసిన కొద్దిసేపటికే మరో మారు SBI కాల్ సెంటర్ నుండి అంటూ భిక్షపతికి మరో ఫోన్ వచ్చింది. కాల్ సెంటర్ నుండి ఫోన్ వచ్చింది అని నమ్మిన భిక్షపతి అన్ని వివరాలు చెప్పారు . అంతే ఆయన మూడు బ్యాంక్‌లలో దాచుకున్న డబ్బులు కట్ అవుతూ మెసేజ్ వచ్చింది.

బ్యాంక్ అధికారులు అనుకుని సమాచారం ఇవ్వడం మాజీ సైనికుని కొంప ముంచింది. పొంచి ఉన్న మోసాన్ని గుర్తించలేక తన బ్యాంకు ఖాతాలో నగదును పోగొట్టుకోవాల్సి వచ్చిందని విలపించారు. వెంటనే బ్యాంకులకు వెళ్లి ఆరాతీయగా ఖాతాలో నగదు మాయమైనట్లు రూఢీ అయింది. వెంటనే బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. ఖాతాలలో డబ్బులు మాయమైన విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని మాజీ సైనికాధికారి కోరుతున్నారు.