(జూలై 28న కృష్ణవంశీ పుట్టినరోజు)
మెగాఫోన్ పట్టిన కొద్ది రోజులకే ‘క్రియేటివ్ డైరెక్టర్’ అన్న మాటను పేరు ముందు చేర్చుకోగలిగారు కృష్ణవంశీ. ‘థింక్ ఔటాఫ్ ద బాక్స్’ అన్న రీతిలో కృష్ణవంశీ సాగుతూ ఉంటారు. పాత కథనైనా కొత్తగా చెప్పాలని తపిస్తారు- అదే కృష్ణవంశీ ప్రత్యేకత. ఆయన కెరీర్ లో సక్సెస్ రేట్ అంతగా లేకున్నా, తన ప్రతి చిత్రంలో వైవిధ్యం ప్రదర్శించాలనే భావిస్తారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ‘రంగమార్తండ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ.
కృష్ణవంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగార్రాజు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ కథలు రాసుకొనేవారు కృష్ణవంశీ. సమకాలీన సమస్యలకూ తగిన పరిష్కారం చూపించాలనీ తపించేవారు. ఆయన తండ్రి ఉద్యోగరీత్యా తెలుగునేలపైని అన్ని ప్రాంతాల్లోనూ తిరిగారు. ఆయనతో పాటు కృష్ణవంశీ కూడా. ఆ రీతిన ఆంధ్ర, కోస్తా, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల స్థితిగతులపై ఆయనకు మంచి అవగాహన ఉంది. తాను రాసుకొనే కథలకు అనుగుణంగా, తన అనుభవాలను వాటిలో చొప్పిస్తూ చిత్రాలను తెరకెక్కించారు కృష్ణవంశీ. అందుకే ఆయన సినిమాలు జనాన్ని ఇట్టే ఆకర్షించేవి. ఇంగ్లిష్ లిటరేచర్ లో మంచి పట్టున్న కృష్ణవంశీ చిత్రసీమలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే అందరి మన్ననలు అందుకున్నారు. కొందరికి అసోసియేట్ గా పనిచేస్తూ సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు గమనించేవారు. ఆ సమయంలోనే రామ్ గోపాల్ వర్మ ‘శివ’ తెరకెక్కిస్తున్నారు. తన కో-డైరెక్టర్ శివనాగేశ్వరరావు ద్వారా కృష్ణవంశీ ప్రతిభ తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ ‘శివ’ కోసం వంశీని ఆహ్వానించారు. ఆ సినిమాకు రాము దగ్గర అసోసియేట్ గా పనిచేసిన వంశీ, తరువాత ఆయన వద్దే కొనసాగారు. రామ్, అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మించిన తెలుగు చిత్రం ‘గులాబీ’ ద్వారా కృష్ణవంశీ దర్శకునిగా పరిచయమయ్యారు. ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘బాఘీ’కి, ఈ సినిమాకు పోలికలు ఉన్నాయని పలువురు చాటింపు వేసినా, జనం వాటిని పట్టించుకోకుండా ‘గులాబీ’ని విజయతీరాలకు చేర్చారు.
‘గులాబీ’ చిత్రాన్ని చూసిన నాగార్జునకు కృష్ణవంశీ టేకింగ్ పై గురి కుదిరింది. వెంటనే ఓ అవకాశం కల్పించారు. తద్వారా వెలుగు చూసిన చిత్రమే ‘నిన్నే పెళ్ళాడతా’. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అప్పటి వరకూ ఉన్న నాగార్జున సినిమాల పాత రికార్డులను తిరగరాసింది. ఒక్కసారిగా చిత్రసీమ కృష్ణవంశీవైపు తిరిగి చూసేలా చేసింది. రెండు చిత్రాల సక్సెస్ తో కృష్ణవంశీ నిర్మాతగా మారారు. ‘ఆంధ్రా టాకీస్’ అనే బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ‘సిందూరం’ తెరకెక్కించారు. ఇందులో నక్సలిజమ్ వర్సెస్ పోలీస్ అనే అంశాన్ని తీసుకొని, సహజత్వం ఉట్టిపడేలా రూపొందించారు. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. తరువాత నాగార్జున మరో అవకాశం కల్పించారు. మళయాళ ‘చంద్రలేఖ’ ఆధారంగా అదే టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’ స్థాయిలో అలరించలేకపోయింది. రాయలసీమ ఫ్యాక్షనిజమ్ నేపథ్యంలో రూపొందించిన ‘అంతఃపురం’ విమర్శకుల ప్రశంసలతో పాటు విజయాన్నీ అందించింది. జగపతిబాబుతో రూపొందించిన ‘సముద్రం’ జనాన్ని అలరించింది. మహేశ్ బాబుతో కృష్ణవంశీ తెరకెక్కించిన ‘మురారి’ అనూహ్య విజయం సాధించింది. మరుసటి సంవత్సరం హిందీలో ‘అంతఃపురం’ చిత్రాన్ని కృష్ణవంశీ దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. ‘శక్తి : ద పవర్’ పేరుతో రూపొందిన ఈ చిత్రం ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచీ కృష్ణవంశీ రూపొందించిన “ఖడ్గం, డేంజర్, రాఖీ, చందమామ, శశిరేఖా పరిణయం, మహాత్మ, మొగుడు, పైసా, గోవిందుడు అందరివాడేలే, నక్షత్రం” వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో కొన్ని జనాన్ని అలరించాయి. మరికొన్ని ఫరవాలేదనిపించాయి. ఇంకొన్ని నిరాశ పరిచాయి. అయితే ‘నిన్నే పెళ్ళాడతా’ స్థాయి విజయాన్ని మాత్రం మళ్ళీ సొంతం చేసుకోలేక పోయారు కృష్ణవంశీ. అయినా, ఆయన అభిమానులు ఏదో ఒక రోజున మళ్ళీ కృష్ణవంశీ జనాన్ని మెప్పించే చిత్రం తీస్తారని ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
“ఖడ్గం, చక్రం, చందమామ” చిత్రాల ద్వారా కృష్ణవంశీ ఉత్తమ దర్శకునిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. కృష్ణవంశీ చిత్రాల ద్వారా మహేశ్ బాబు, జూ.యన్టీఆర్, ప్రభాస్, కాజల్ – తమ నటనతో జనాన్ని ఆకట్టుకోగలిగారు. కృష్ణవంశీ ప్రయోగాల బాట పట్టకుండా, కమర్షియల్ ఫార్ములాతోనే సాగి ఉంటే, ఈ పాటికి మరికొన్ని సూపర్ హిట్స్ ఆయన ఖాతాలో చేరేవనీ కొందరు అభిప్రాయపడతారు. ఏది ఏమైనా కృష్ణవంశీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘రంగమార్తాండ’తో మళ్ళీ జనాన్ని అలరిస్తారని ఆశిద్దాం.