NTV Telugu Site icon

రివ్యూ : క్రేజీ అంకుల్స్

Crazy Uncles Review

Crazy Uncles Review

ఆగస్ట్ 19న విడుదలైన మూడు తెలుగు సినిమాలలో ‘క్రేజీ అంకుల్స్’ కూడా ఒకటి. దీని దర్శకుడు ఇ. సత్తిబాబుకు దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. పది, పన్నెడు చిత్రాలనూ తెరకెక్కించాడు. అలానే గుడ్ సినిమా గ్రూప్ కు తెలుగు ఆడియెన్స్ లో ఓ గుర్తింపు ఉంది. ఇక దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నాడంటే… సమ్ థింగ్ స్పెషల్ అనే అందరూ భావిస్తారు. రాజా రవీంద్ర, మనో, భరణి శంకర్ వంటి గుర్తింపు ఉన్న ఆర్టిస్టులు కీలక పాత్రలు చేశారంటే… కొంతలో కొంత అంచనాలు ఏర్పడటం ఖాయం. వారికి తోడు పాపులర్ యాంకర్ శ్రీముఖి జత కలిస్తే… ఆ అంచనాలు ఇంకాస్తంత ఎక్కువగా ఉంటాయి. మరి ఆ స్థాయిలో ‘క్రేజీ అంకుల్స్’ మెప్పించారో లేదో తెలుసుకుందాం.

గోల్డ్ షాప్ ఓనర్ రెడ్డి (మనో), రియల్ ఎస్టేట్ అధినేత రాజు (రాజా రవీంద్ర), ఫైనాన్స్ బిజినెస్ చేసే రావు (భరణి శంకర్) ముగ్గురూ మంచి దోస్తులు. ముద్దుగా వీళ్ళను ఆర్.ఆర్.ఆర్. అనుకోవచ్చు. ఈ ముగ్గురికీ ఉన్న కామన్ ప్రాబ్లమ్స్ భార్యలే. వారి కారణంగా ఒంటరితనం ఫీలవుతున్న వీరి జీవితంలోకి ఊహించని విధంగా పాపులర్ సింగర్ స్వీటీ (శ్రీముఖి) ప్రవేశిస్తుంది. ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెకు చేరువ కావాలని ప్రయత్నాలు చేస్తారు. మొత్తం మీద రాజు బర్త్ డే సందర్భంగా ఆమెతో ఓ ఈవెంట్ ను ప్లాన్ చేస్తారు. అక్కడ జరగరాని వ్యవహారం జరిగిపోతుంది. సందట్లో సడేమియా అన్నట్టుగా స్వీటీ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కానీ అందుకు కారణం ఎవరనేది సస్పెన్స్! మరి ఈ ఊహకందని ట్విస్టు ‘ట్రిపుల్ ఆర్’ ఫ్రెండ్స్ ను ఎలా ఉక్కిరి బిక్కిరి చేసింది? వయసు కానీ వయసులో మనసు చేసిన అల్లరికి బానిస అయిన వీరికి స్వీటీ చివరకు ఎలాంటి గుణపాఠం చెప్పిందన్నదే ఈ ‘క్రేజీ అంకుల్స్’ కథ.

ముసలోడికి దసరా పండగ అనే సామెత ఉండనే ఉంది. అవకాశం దొరికింది కదా! అని కొందరు, అవకాశం దొరకపుచ్చుకుని మరికొందరు… లైఫ్ ను అడ్డదారుల్లో ఎంజాయ్ చేయాలని చూస్తుంటారు. దానికి పర్యవసానాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో తెలియచేస్తూ గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో మర్డర్ మిస్టరీలు ఉన్నాయి. కానీ అలాంటి థ్రిల్లర్ జోనర్ కు పోకుండా… రొమాంటిక్ యాంగిల్ నే టచ్ చేస్తూ ఈ ‘క్రేజీ అంకుల్స్’ మూవీ సాగింది. అయితే… దర్శకుడు ఇ. సత్తిబాబు, రచయిత ‘డార్లింగ్’ స్వామి రాసుకున్న ట్విస్టులు ఏవీ కొత్తగా అనిపించవు. అలానే వినోదం పేరుతో చిత్రీకరించిన సన్నివేశాలూ రొటీన్ గా ఉన్నాయి.

నటీనటుల విషయానికి వస్తే… రాజా రవీంద్ర, మనో, భరణి శంకర్… తమ పాత్రలకు న్యాయం చేకూర్చేందుకు బాగానే ప్రయత్నించారు. రాజా రవీంద్రకు ఈ ముగ్గురిలో కాస్తంత ఎక్కువ మార్కులు పడతాయి. ఇక బాలనటుడిగా మంచి అనుభవం సంపాదించిన మనో… కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తెర మీదకు వచ్చారు. ఈ సినిమాకు క్రేజ్ వచ్చిందంటే శ్రీముఖినే కారణం. ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్ కూడా ఆమెనే! అయితే శ్రీముఖిని ఇంకాస్తంత కొత్తగా దర్శకుడు సత్తిబాబు చూపించి ఉండాల్సింది. ఇక మిగిలిన పాత్రలలో పోసాని, ప్రవీణ్‌, బండ్ల గణేశ్, హేమ తదితరులు కనిపిస్తారు. రఘు కుంచే సంగీతం బాగుంది. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కూడా ఓకే. వయసు మీరినప్పుడు మనసుకు కాస్తంత కళ్ళెం వేయాలని, లేదంటే ఇబ్బందులు పడక తప్పదని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. గుడ్ ఫ్రెండ్స్ అండ్ బొడ్డు అశోక్ నిర్మించిన ఈ సినిమా ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేస్తూ సాగింది. ఇలాంటి రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ ను ఇష్టపడే వర్గం ఒకటి ఉంది కాబట్టి వారికి ఈ సినిమా నచ్చుతుంది.

ప్లస్ పాయింట్స్

మైనెస్ పాయింట్

ట్యాగ్ లైన్: రొమాంటిక్ అంకుల్స్!

రేటింగ్: 2.5 / 5

Show comments