Site icon NTV Telugu

టీనేజర్ల కోసం కరోనా వ్యాక్సిన్.. మార్గదర్శకాలు విడుదల

జనవరి 3 నుంచి 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సిన్ అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 15 నుంచి 18 ఏళ్ల వయసు వాళ్లు జనవరి 1 నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చని సూచించింది. దీని కోసం చిన్నారులు విద్యాసంస్థల ఐడీ కార్డులను కూడా రిజిస్ట్రేషన్ కోసం ఉప‌యోగించ‌వ‌చ్చని తెలిపింది. వీళ్లు తప్పనిసరిగా ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొంద‌రు చిన్నారులకు ఆధార్, ఇతర అవసరమైన ఐడీ కార్డులు ఉండకపోవచ్చని.. అందుకే విద్యాసంస్థల ఐడీ కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు కోవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ వివరించారు.

15-18 ఏళ్ల వారు వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి:

కొవిన్ యాప్ లేదా వెబ్‌సైటులో ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPని వెరిఫై చేయాలి. ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆధార్ నెంబర్ లేదా విద్యాసంస్థకు సంబంధించిన ఐడీ నెంబర్ వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.. అనంతరం వ్యాక్సినేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి. భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా లేదా జైడస్ కాడిల్లా టీకాను బుక్ చేసుకోవచ్చు. కోవిన్ యాప్‌లో అపాయింట్‌మెంట్ కోసం బుక్ చేసుకోకపోతే నేరుగా ఏదైనా వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్ సమర్పించి కరోనా వ్యాక్సిన్ పొందవచ్చు.

Exit mobile version