ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ సాగుతోంది.. భారత్‌లోనూ ఈ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ డోస్ వంద శాతం పూర్తిచేశారు.. సెకండ్ డోస్ వేస్తున్నారు.. ఇక, టీనేజర్లకు కూడా టీకా వేసేసేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా 15 – 18 ఏళ్ల వయసు పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల ప్రకారం వీరందరికీ కోవాగ్జిన్ టీకాల పంపిణీకి అన్ని రాష్ట్రాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. జిల్లాల వారీగా ఉన్న 15-18 ఏజ్ గ్రూప్ గణాంకాలను తీసి.. మాకు ఇన్ని టీకాలు కావాలని ప్రభుత్వానికి చెప్పడం.. ఆ మెరకు వారికి వ్యాక్సిన్లు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను నేటి నుంచి ప్రారంభం అవుతుండగా.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఆదేశించినట్లుగా, భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ టీకాను మాత్రమే ఇవ్వనున్నారు.. డిసెంబర్ 25, 2021న జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ.. 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కరోనా టీకాలు వేయడానికి ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు పౌరులకు మూడో డోసు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. అందులో భాగంగా.. ఈ నెల 10వ తేదీ నుంచి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న 60 ఏళ్లు పైబడినవారికి బూస్టర్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.
