NTV Telugu Site icon

ఇంట్లోనే కోవిడ్ టెస్ట్.. రూ.250కే కిట్.. ఎలా చేయాలంటే..?

Covid home kit

రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు మ‌రింత సులువుగా.. ఇంటి ద‌గ్గ‌ర‌మే స్వ‌యంగా చేసుకునే వెసులుబాటు వ‌చ్చేస్తోంది… క‌రోనా టెస్ట్ చేయించుకోవాలంటూ.. స్థానికంగాఉన్న పీహెచ్‌సీకో.. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వెళ్లి గంట‌ల త‌ర‌బ‌డి వేచిఉండాల్సిన అవ‌స‌రం లేదు.. ఇక‌, ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో డ‌బ్బులు చెల్లించాల్సిన ప‌నిలేదు.. ఎందుకంటే.. ర్యాపిడ్‌ టెస్ట్.. ఇంటి వద్దే చేసుకునే విధంగా ఎట్‌-హోం కోవిడ్‌ టెస్టింగ్‌ కిట్లకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది ఐసీఎంఆర్.. ఈ కిట్లు మరో రెండు మూడు రోజుల్లోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయ‌ని చెబుతున్నారు.. ఈ కిట్ ధ‌ర సామాన్యులకు కూడా అందుబాటులోనే ఉంది.. ఒక్కో కిట్ ధర రూ. 250గా నిర్ణ‌యించామ‌ని తెలిపారు ఐసీఎంఆర్‌ డీజీ బలరామ్‌ భార్గవ్‌. అయితే, క‌రోనా టెస్ట్‌ల సంఖ్య‌ను క్ర‌మంగా పెంచాల‌ని టార్గెట్‌గా పెట్టుకుంది స‌ర్కార్.. ప్రస్తుతం రోజుకు 20 లక్ష క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేస్తుండ‌గా.. ఆ సంఖ్య‌ను నెలాఖరుకు 25 లక్షలకు, జూన్‌ ఆఖరు వ‌ర‌కు 45 లక్షల పెంచాలని టార్గెట్ పెట్టుకుంది.. అయితే, ప్ర‌స్తుతం ఉన్న వ్య‌వ‌స్థ‌తో టెస్ట్‌ల సంఖ్య ఆ స్థాయిలో పెంచే అవ‌కాశం లేదు.. కానీ, ఎట్‌-హోం కోవిడ్‌ టెస్టింగ్ కిట్లు వ‌స్తే.. టెస్టుల సంఖ్య భారీగా పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌, హోం కోవిడ్ టెస్ట్‌ను ఎలా ఉప‌యోగించాల‌న్న దానిపై వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేసింది ఐసీఎంఆర్… ముందుగా కెమిస్ట్ షాప్ నుండి టెస్ట్ కిట్ కొనుగోలు చేయాలి.. ఆ త‌ర్వాత మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.. అందులోని యూజ‌ర్ మాన్యువ‌ల్ చ‌దువుతూ వివ‌రాలు న‌మోదు చేసుకోవాలి.. ఆ త‌ర్వాత ఇంట్లో పరీక్ష నిర్వ‌హించాలి.. ఇక‌, మొబైల్ ఇమేజ్ క్లిక్ చేసి అప్‌లోడ్ చేస్తే.. వెంట‌నే ప‌రీక్ష ఫ‌లితం వ‌స్తుంద‌ని చెబుతోంది ఐసీఎంఆర్. కేవ‌లం 15 నిమిషాల్లోపే ఈ టెస్ట్ ఫ‌లితం తెలుస్తుంద‌ని చెబుతున్నారు.