కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. కోట్లాదిమంది అయినవారిని కోల్పోయారు. అయితే కరోనా కారణంగా ఫార్మా రంగం పరిస్థితి మూడు వ్యాక్సిన్లు.. ఆరు శానిటైజర్లలా మారింది. గత రెండేళ్ళుగా కరోనా మహమ్మారి దెబ్బకు అల్లాడిన కంపెనీలు, సాధారణ జనం ఇప్పడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న వేళ ఒమిక్రాన్ రూపంలో అలజడి రేగుతోంది.
మనదేశంలో గత నెలలో మందుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చినప్పుడు 6.6 శాతం పైగా పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్యాస్ట్రో-ఇంటెస్టినల్, శ్వాసకోశ వ్యాధులు, నొప్పి నివారణ, గైనకాలజీ, నరాల వ్యాధులకు సంబంధించిన అమ్మకాలు బాగా వృద్ధి చెందాయి.
దేశీయ ఔషధాల మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో, క్రితం ఏడాదితో పోల్చితే అత్యధిక వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 51.5 శాతం, మే నెలలో 47.8 శాతం వృద్ధి కనిపించగా.. అది డిసెంబర్ నాటికి గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. కోవిడ్ తర్వాత డెల్టా వేరియంట్ విజృంభణతో ఎంతో మంది ఆస్పత్రుల పాలయ్యారు. కోవిడ్ మందులు, శానిటైజర్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, మాస్కుల అమ్మకాలు పెరిగాయి. వీటిని తయారుచేసే కంపెనీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఉత్పత్తిని పెంచాయి.
అక్టోబరు నెల నాటికి మందుల అమ్మకాల్లో పెరుగుదల కనిష్ఠంగా 5 శాతానికి దిగివచ్చింది. మళ్లీ నవంబరులో 6.6 శాతం పెరిగింది. వైద్యసేవలు సాధారణ స్థితికి చేరుకోవటం, జీవనశైలి వ్యాధులు, ఇతర జబ్బుల బారిన పడినవారు చికిత్సలకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నందున నవంబరు నెల మందుల అమ్మకాల్లో కొంత పెరుగుదల వుంది.
ఫార్మా కంపెనీలలో మందుల అమ్మకాల్లో అరిస్టో ఫార్మా, ఎమ్‌క్యూర్ ఫార్మా, మెక్లాయిడ్, డాక్టర్ రెడ్డీస్, ఆల్కెమ్, మ్యాన్‌కైండ్ ఫార్మా అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెప్పాలి. అరిస్టో ఫార్మా అమ్మకాలు ఏకంగా 29 శాతం పెరిగాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఎమ్‌క్యూర్ అమ్మకాలు 26 శాతం, మెక్లాయిడ్ అమ్మకాలు 24 శాతం పెరిగినట్లు గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. గ్లెన్‌మార్క్, సన్‌ఫార్మా, సిప్లా, టొరెంట్ ఫార్మా అమ్మకాలు 16 శాతం వరకూ పెరిగాయి. ప్రస్తుం ఒమిక్రాన్ ప్రభావం వల్ల ఫార్మా వ్యాపారం మరింతగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.