కరోనా వైరస్‌కు మందు తయారుచేసిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆనందయ్య స్వయంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆనందయ్య సోమవారం నాడు విశాఖ జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
Read Also: మంచి మనసు చాటుకున్న టీమిండియా కోచ్ ద్రవిడ్
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు బీసీ ప్రజలను సరిగ్గా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రాజకీయ పార్టీలు బీసీలను విస్మరించడం సరికాదని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని ఆనందయ్య తెలిపారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కరోనా థర్డ్ వేవ్ వస్తే.. దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని ఆనందయ్య వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు సహకరిస్తే ఆ మందును ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య పేర్కొన్నారు.
