కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.5వేల కోట్లను ఖర్చు చేసిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఫలితం టీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. హుజురాబాద్ ప్రజలు అదిరిపోయే తీర్పు ఇచ్చారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
Read Also: టీఆర్ఎస్ నేతల గ్రామాల్లోనూ ఈటల హవా
అయితే కోమటిరెడ్డి చేసిన ఓ వ్యాఖ్య పలు అనుమానాలకు తావిస్తోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఈటెలకు మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యతో హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సహకరించిందని అర్ధమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హుజురాబాద్ ఎన్నికకు ముందు చీకట్లో రేవంత్, ఈటల కలిసి మంతనాలు జరిపారని మంత్రి కేటీఆర్ కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేటీఆర్ ఆరోపణలు నిజమనిపించేలా కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.