NTV Telugu Site icon

మరపురాని మల్లికార్జునరావు కామెడీ!

కొందరు కొన్ని పాత్రలతో ఇట్టే జనం మదిలో చోటు సంపాదించేస్తారు. వంశీ తెరకెక్కించిన ‘లేడీస్ టైలర్’లోని బట్టల సత్తి పాత్రతో మల్లికార్జున రావుకు ఎనలేని గుర్తింపు లభించింది. అప్పటి నుంచీ మల్లికార్జునరావు తెరపై కనిపిస్తే చాలు జనం ‘బట్టల సత్తి’ అంటూ పిలిచేవారు. అలా ‘బట్టల సత్తి’ గా జనం మదిలో నిలచిన మల్లికార్జున రావు తన దరికి చేరిన ఏ పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయేవారు. జనాన్ని ఆకట్టుకొనేవారు.

మల్లికార్జునరావు 1951 డిసెంబర్ 13న అనకాపల్లి సమీపంలోని కాశిమ్ కోటలో జన్మించారు. బాల్యం నుంచీ నాటకాలు చూడడం, అందులో నచ్చిన పాత్రల్లాగే నటించడం అలవాటు చేసుకున్నారు. దాంతో చదువుకొనే రోజుల్లోనే మిత్రులతో కలసి నాటకాలు వేశారు. రావు గోపాలరావు ఆయనను ప్రోత్సహించారు. రావు గోపాలరావు చిత్రసీమలో తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా జీవితం ఆరంభించారు. ఆ సమయంలోనే ఆయనను కలసిన మల్లికార్జునరావుకు సినిమాల్లో ఎలా నటించాలో మెలకువలు చెబుతూ ఉండేవారు. రావు గోపాలరావు నటుడై మంచి పేరు సంపాదించాక, మల్లికార్జునరావును ఆదరించారు. మల్లికార్జునరావులోని నటునికి దర్శకుడు వంశీ తాను తెరకెక్కించిన “మంచు పల్లకి, సితార, అన్వేషణ, ప్రేమించు పెళ్ళాడు, లేడీస్ టైలర్, ఆలాపన” వంటి చిత్రాలలో అవకాశాలు కల్పించారు. ఈ సినిమాలతో నటునిగా మంచి గుర్తింపు సంపాదించారు మల్లికార్జునరావు. ఇతర సినిమాల్లోనూ పాత్రలు లభించాయి. దాంతో మల్లికార్జునరావుకు నటునిగా మరింత గుర్తింపు లభించింది. అయితే వంశీ మాత్రం తాను తెరకెక్కించే ప్రతీ చిత్రంలో మల్లికార్జునరావుకు ఏదో ఒక వైవిధ్యమైన పాత్రను ఇచ్చేవారు. అలా “లాయర్ సుహాసిని, శ్రీకనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, చెట్టుకింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, డిటెక్టివ్ నారద” చిత్రాలలో విలక్షణమైన పాత్రలు ఇచ్చారు వంశీ.

ఎస్వీ కృష్ణారెడ్డి, ఇ.వి.వి. సత్యనారాయణ వంటి హాస్య చిత్రాల దర్శకులు కూడా మల్లికార్జునరావులోని నటునికి తగ్గ వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు. తమ్ముడు సినిమాలోని మల్లికార్జున రావు నటనకు బెస్ట్ కేరెక్టర్ యాక్టర్ గా అవార్డు లభించింది. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సైతం తమ చిత్రాలలో మల్లికార్జునరావుకు తగ్గ పాత్రలు ఇచ్చేవారు. శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఛైర్మన్ గానూ మల్లికార్జునరావు సేవలు అందించారు. ‘మా’ కు జనరల్ సెక్రటరీగానూ ఆయన పనిచేశారు. తెలుగు దేశం పార్టీ కల్చరల్ వింగ్ కు సెక్రటరీగానూ ఆయన ఉన్నారు. 2008 జూన్ 24న మల్లికార్జున రావు తుదిశ్వాస విడిచారు.

భౌతికంగా మల్లికార్జునరావు లేకపోయినా, ఆయన పోషించిన అనేక పాత్రలు ఈ నాటికీ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతూనే ఉన్నాయి. ఇప్పటికీ జనం ఆయనను ‘బట్టల సత్తి’గానే గుర్తుచేసుకుంటూ ఉంటారు.