విద్యార్థుల తల్లిదండ్రులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం డబ్బులు చెల్లించారు.. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యాదీవెన డబ్బులను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం వల్ల అక్షరాల 11.03 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.. మూడో త్రైమాసికం పూర్తయిన వెంటనే నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామన్న ఆయన.. పూర్తి ఫీజు రియింబర్స్‌మెంట్ గొప్పగా అమలవుతోందన్నారు.. పెద్ద చదువులు చదవడానికి, పెద్ద స్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డుకాకూడదని.. తమ ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటే కాక, గత ప్రభుత్వ బకాయిలు రూ.1778 కోట్లతో కలిపి రూ.6259 కోట్లు చెల్లించిందని వెల్లడించారు.
Read Also: రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీల వాకౌట్..
ఇక, జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ చదివేవారికి రూ.5వేలు, పాలిటెక్నిక్ చదివేవాళ్లకి 15 వేలు, డిగ్రీ, ఇతర కోర్సులు చదివేవారికి 20వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పటి వరకు రూ.2267 కోట్ల రూపాయలు ఇచ్చామని గుర్తుచేసిన ఆయన.. మంచి మేనమామలా, తల్లులందరికీ మంచి అన్నగా, తమ్ముడిగా మంచి చేస్తున్నాం అన్నారు.. విద్యాదీవెన, వసతి దీవెన ఈ రెండు పథకాలకు కలిపి ఈ రెండు ఏళ్లలో రూ.8500 కోట్లకుపైగా ఇచ్చామని వెల్లడించారు.. 2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా మరో 10 డిగ్రీలు కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపిన ఏపీ సీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో రూ.880 కోట్లతో నాడు – నేడుకు శ్రీకారం చుడుతున్నామని.. మరో రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి అవుతాయని, కొత్తగా 16 మెడికల్ కాలేజీలు తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరం జిల్లాల్లో గురజాడ జేఎన్డీయూ యూనివర్శిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్శిటీని తీసుకుని వస్తున్నాం.. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీని తీసుకు వస్తున్నాం, కురుపాంలో ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ, పాడేరులో మెడికల్ కాలేజీ తీసుకు వస్తున్నామని వెల్లడించారు ఏపీ సీఎం వైఎస్ జగన్.