NTV Telugu Site icon

ఆరోగ్యశ్రీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్యాన్సర్ బాధితులకు ఉత్తమ చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కనీసం మూడు క్యాన్సర్‌ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీల ఆస్పత్రులు లేకపోవడం వల్ల ప్రజలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలి వెళ్లాల్సి వస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో సూపర్‌ స్పెషాల్టీ సేవలు అందుతాయని ఇవికాకుండా క్యాన్సర్‌ చికిత్స కోసం ప్రత్యేకంగా మూడు సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు ఏర్పాటవుతాయని తెలిపారు.

Read Also: కలెక్టర్ సింప్లిసిటీ… రెండు కి.మీ. నడిచి ఆఫీస్‌కు వెళ్తున్న కలెక్టర్

మరోవైపు ఆరోగ్యశ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చేందుకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. ఇందులో సందేహాల నివృత్తికి ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సూచించారు. ఈ యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ఇవ్వనుంది. వారికి సెల్‌ఫోన్లు సమకూర్చేందుకు సీఎం జగన్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కాగా ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేసి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సీఎం తెలిపారు.