అమరావతి : రాజధాని చట్టాల ఉప సంహరణ తాత్కాలికమేనని స్పష్టం చేశారు సీఎం జగన్. మళ్లీ మెరుగ్గా బిల్లు సిద్దం చేసి వికేంద్రీకరణ విషయంలో ముందుకు వెళతామని చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని అన్ని వర్గాలకు వివరించేందుకు.. బిల్లులు మరింత మెరుగు పరిచేందుకు ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు వివరించేందుకు గతంలో చేసిన చట్టాన్ని వెనక్కి తీసుకున్నామని… మళ్లీ సమగ్ర, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని పేర్కొన్నారు.
విశాల ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం జగన్. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని…అమరావతి ప్రాంతం అంటే నాకు ఎటువంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు సీఎం జగన్. తన ఇల్లు ఇక్కడే ఉంది.. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ ఉందని చెప్పారు. రాజధాని అటు విజయవాడ కాదు.. ఇటు గుంటూరు కాదని చెప్పారు. ఈ ప్రాంతంలో కనీస వసతుల కల్పనకే లక్ష కోట్లు అవుతుందన్నారు.
