Site icon NTV Telugu

ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదం.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కూడా కన్నుమూత..

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ప్రాణాలతో బయటపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్ సింగ్‌ కూడా ఇవాళ కన్నుమూశారు.. హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రగాయాల‌పాలైన వ‌రుణ్ సింగ్‌ను కాపాడేందుకు బెంగ‌ళూరులోని క‌మాండ్ ఆస్పత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. దీంతో.. హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన సమయంలో.. దాంట్లో ప్రయాణం చేస్తున్న అందరూ మృతిచెందినట్టు అయ్యింది.. కాగా, ఈ నెల 8వ తేదీన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటనలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ స‌హా 13 మంది ప్రాణాలు కోల్పోగా.. తీవ్రగాయాల‌తో కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు.. బెంగ‌ళూరులోని క‌మాండ్ ఆసుప‌త్రిలో ప్రాణాలతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు వరుణ్‌ సింగ్.

Read Also: తూర్పుగోదావరిలో ఒమిక్రాన్‌ కలకలం..!

ఇక, కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృతిపై సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది భారత వాయుసేన.. ఈ నెల 8న హెలికాప్టర్ ప్రమాదంలో గాయాలపాలైన కెప్టెన్‌ వరుణ్‌ సింగ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉద‌యం ప్రాణాలు వదిలారని.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు భార‌త వాయుసేన సంతాపం తెలుపుతోందంటూ.. భార‌త వాయుసేన ట్వీట్‌ చేసింది. కాగా, ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదానికి గురై.. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య సహా మొత్తం 14 మంది మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక, కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. వరుణ్‌ సింగ్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Exit mobile version