మెగాస్టార్ చిరంజీవి ఆదివారం బిజీబిజీగా గడిపారు. “లవ్ స్టోరీ” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌తో పాటు ‘సైమా’ అవార్డుల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘లవ్ స్టోరీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి మాట్లాడుతూ చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
ఆయన మాట్లాడుతూ “ఐదారుమంది హీరోలో, ఐదారు మంది ప్రొడ్యూసర్లు కలిస్తే సినిమా ఇండస్ట్రీ కాదు. వీళ్ళు బాగున్నారు కదా.. సినిమా ఇండస్ట్రీ అంతా పచ్చగా ఉంది అంటే మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత చెప్పాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలోని కార్మికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. మాకు తోచినంత సహాయం చేశాము. వారందరికీ 3-4 నెలలు నిత్యావసర సరకులు అందించగలిగాము. అదృష్టం కొద్దీ ఇటీవల సినిమా షూటింగ్ లు ప్రారంభమయ్యాయి, అద్నరూ ట్రాక్ లో పడ్డారు. ఒక నెల షూటింగ్ లేకపోతే కార్మికులు ఎలా విలవిలలాడిపోతారు అనేది తెలియడానికి ఇదంతా చెప్తున్నా. ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది మా సినిమా ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు సంక్షోభంలో పడిపోయింది. సినిమా కాస్ట్ పెరిగిపోయింది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదిది. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు ‘లవ్ స్టోరీ వేదికగా అడుగుతున్నాను… ఇంతకుముందే రామ్ మోహన్ రావు, నారాయణదాస్ నారంగ్ తదితర నిర్మాతలతో మేమంతా కలిసి అంత రెవెన్యూ రాకపోవడానికి కారణంగా ఏంటి అనే విషయంపై ప్రభుత్వాలకు విన్నవించుకున్నాము.
Read Also : ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
దానికి సానుకూలంగా స్పందించారు. కానీ ఇంతవరకూ జీవో రాలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని కూడా సభాముఖంగా అడుగుతున్నాను. కనికరించండి. మాపై ప్రత్యేక దృష్టి పెట్టండి. బయట ఏదో చెప్పుకుంటున్నట్టు హీరోలు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటారు. డైరెక్టర్లు బాగా సంపాదించుకుంటారు అనేది నాలుగైదుగురికి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ కోసం మిగతా వారికి ఇబ్బంది కలిగేలా దయచేసి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోవద్దని సభాముఖంగా వినమ్రంగా అడుగుతున్నాను. దయచేసి సానుకూలంగా స్పందించి, మా రిక్వెస్ట్ లను మన్నించి పరిష్కార మార్గం చూడండి. కూరగాయలతో సహా మనం ఏ వస్తువును అయినా చూసి కొంటాము. కానీ ఒక్క సినిమాను మాత్రమే కొని చూస్తాము. అది మాపై నమ్మకం. మేము కూడా ప్రేక్షకులను బలవంతం చేయము.
చిరంజీవి సినిమా విడుదలైంది అంటే వాళ్లకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయని నమ్మకం. చిరు సినిమాను ఎంత ఖర్చు చేసైనా చూడాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ కోసం మేము కూడా మా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. అప్పుడప్పుడూ ఫెయిల్యూర్స్ రావొచ్చు. ఒక్కోసారి అనుకున్న గమ్యాన్ని చేరకపోవచ్చు. అంటే మా తప్పు అంతేకాని మోసం, దగా కాదు. వాళ్లకు ఎంటెర్టైన్మెంట్ ఇవ్వాలని ఇండస్ట్రీ కోరుకునే మాకు సాధక బాధకాలు ఉన్నప్పుడు మీరు దయచేసి దృష్టి సారించి ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించండి. మేము ఆశగా అడగట్లేదు, అవసరానికి అడుగుతున్నాము. ఈ సమస్యను పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము” అంటూ ‘లవ్ స్టోరీ’ వేడుక వేదికగా తెలుగు రాష్ట్రాలకు ఇండస్ట్రీ సమస్యలను విన్నవించారు. మరి ఇప్పటికైనా వారి సమస్యకు పరిష్కారం లభిస్తుందేమో చూద్దాం.