మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు గత కొన్ని రోజుల నుండి సంబరాలు, సేవాకార్యక్రమాలు జరుపుతుంటే… తాజాగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఒకరోజు ముందు నుండే రావడం మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ‘లూసిఫర్’ మూవీకి తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి ‘గాడ్ ఫాదర్’ అనే పేరు పెట్టారు. రామ్ చరణ్ సమర్పణలో ఆర్. బి. చౌదరితో కలిసి ఎన్వీ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు ‘జయం’ మోహనరాజా దీనికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
మారియో క్యూజో రాసిన ‘గాడ్ ఫాదర్’ నవల ఆరోజుల్లో విశేష ఆదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కాపీలు అమ్ముడై అప్పట్లో ‘గాడ్ ఫాదర్’ నవల చరిత్రను సృష్టించింది. ఆ నవలను ఆధారంగా చేసుకుని, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలో ‘గాడ్ ఫాదర్’ను మూడు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం, రెండో భాగం ఉత్తమ చిత్రాలుగా ఆస్కార్ ను సొంతం చేసుకోవడం విశేషం. మొదటి భాగంలో గాడ్ ఫాదర్ గా నటించిన మార్లన్ బ్రాండో నటనకు ఆస్కార్ అవార్డు కూడా లభించింది. బ్రాండో నటించిన ‘గాడ్ ఫాదర్’ చూసి ఎంతో మంది దేశ విదేశాల్లో నటనారంగంలో అడుగుపెట్టారు. అలానే ఆ సినిమాల స్ఫూర్తితో ఎంతోమంది దర్శకులు కూడా తయారయ్యారు. వారిలో రామ్ గోపాల్ వర్మ కూడా ఒకరు. ‘గాడ్ ఫాదర్’ పోకడతోనే ‘గాయం, సర్కార్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అంతలా ప్రభావితం చేసిన టైటిల్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ కు పెట్టడం ఆసక్తిగా మారింది.
తెలుగులో ‘గాడ్ ఫాదర్’ టైటిల్ తో గతంలో అక్కినేని నాగేశ్వరరావు తో ఓ చిత్రం రూపొందింది. ఇప్పుడు అదే టైటిల్ తో చిరంజీవి జనం ముందుకు రాబోతున్నాడు. అయితే హాలీవుడ్ మూవీ ‘గాడ్ ఫాదర్’కు మలయాళ చిత్రం ‘లూసిఫర్’కు పెద్దంత పోలికలు లేవు. అయితే ఇది కూడా ఓ పొలిటికల్ డ్రామానే! మోహన్ లాల్ తో పాటు మలయాళ చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు ఈ మూవీలో నటించారు. తెలుగులో మాత్రం ఎవరెవరు ఏ యే పాత్రలు పోషించబోతున్నారన్నది తెలియరాలేదు. మూవీ రెగ్యులర్ షూటింగ్ ను మాత్రం ఇటీవలే ప్రారంభించినట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. ‘ఆచార్య’ మూవీ తర్వాత విడుదల కాబోతున్న చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’ కావడం విశేషం.
