ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఇంత హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. దీపావళి పండుగ రోజు నామినేషన్లు వేయడమేంటని నిలదీశారు. దీపావళి పండగ కూడా జరుపుకోనివ్వకుండా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేయడం లేదని… దీపావళి పండగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తే వచ్చే నష్టమేంటన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఆర్వోలు డ్రామాలాడితే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Read Also: బేతంచర్లలో ఎన్నికల వేడి.. టీడీపీ వర్సెస్ వైసీపీ
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు దారుణంగా జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. నామినేషన్లు మొదలుకుని కౌంటింగ్ వరకు అధికార పార్టీ అడ్డగోలుగా వ్యవహరించిందన్నారు. నామినేషన్ పత్రాలను స్కానింగ్ చేసుకోవాలి.. ఆ స్కానింగ్ పత్రాలను ఆర్వోలకు మెయిల్ చేయాలన్నారు. నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్దతిగా వ్యవహరించాలని హితవు పలికారు. కొంత మంది ఆర్వోలు నామినేషన్లను చెల్లకుండా చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లను చించేసిన సంఘటనలు జరిగాయన్నారు. గతంలో నామినేషన్‌లో తప్పులుంటే అధికారులు సహకరించేవారు అని, ఇప్పుడు నామినేషన్‌లు తీసుకుని డిస్ క్వాలిఫై చేస్తున్నారని మండిపడ్డారు. కావున అభ్యర్ధులు నామినేషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని దాఖలు చేయాలన్నారు. నామినేషన్ల దాఖలుకు ముందు.. తర్వాత సోషల్ మీడియాలో నామినేషన్ పత్రాలను పెట్టాలని సూచించారు. దొంగ ఓట్లను నివారించేందుకు ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
