Site icon NTV Telugu

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం.. రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు వస్తున్నాయి.. క్రమంగా అన్ని తెరచుకుంటున్నాయి.. ఈ తరుణంలో.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కునుకులేకుండా చేస్తోంది.. భారత్‌ను కూడా ఈ కొత్త వేరియంట్‌ టెన్షన్‌ పెడుతోంది.. దీంతో.. క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భారత్‌ అప్రమత్తం అయ్యింది.. ఇక, రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసింది.. ఆరోగ్యశాఖ‌ల అధికారుల‌తో అత్యవ‌స‌ర స‌మావేశాలు ఏర్పాటు చేసి ముందుజాగ్రత్త చ‌ర్యలకు పూనుకుంటుంది.. ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారుల‌తో స‌మావేశ‌మై కొత్త వేరియంట్‌పై చర్చించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇక, ఒమిక్రాన్‌పై అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు అప్రమత్తం చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.. అందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరోగ్యశాఖ కార్యద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ లేఖ రాశారు.. అలర్ట్‌గా ఉండాలని సూచించారు.

Read Also: కనీస మద్దతు ధర చట్టం తేవాలి.. మేం 24 పంటలకు మద్దతు ధర ఇస్తున్నాం..!

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు అప్రమత్తమై కొత్త ఆంక్షలు విధిస్తున్నాయి.. అయినా, కొత్త వేరియంట్ దేశంలో ప్రవేశించే ప్రమాదం పొంచి ఉందనే అంచనాలు కేంద్రాన్ని బటయపెడుతున్నాయి.. ఈ తరుణంలో.. ప్రభుత్వాలు అత్యంత అప్రమ‌త్తంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు లేఖ రాశారు రాజేశ్ భూష‌ణ్.. కోవిడ్ నిబంధనలు క‌ఠినత‌రం చేయాల‌ని, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ‌య‌ట‌ప‌డితే ఆ వైర‌స్ సోకిన వారిపై నిరంత‌ర నిఘా ఉంచాల‌ని.. అదేవిధంగా వ్యాక్సినేష‌న్ ప్రక్రియ మరింత వేగంగా సాగేలా చూడాలని ఆ లేఖలో తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు.. ముఖ్యంగా కొత్త వేరియంట్‌ బాధిత దేశాల నుంచి వచ్చేవారికి స్క్రీనింగ్ చేయడం మరియు 14 రోజుల క్వారంటైన్‌తో పాటు, ఆ ప్రాంతంలో కేసులపై ఆరా తీయాలని ఆదేశించింది. కొత్త కేసులు వెలుగుచూసిన ప్రాంతాల్లోని పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి మరియు కోవిడ్ -19 ను సమర్థవంతంగా నియంత్రించడానికి హాట్‌స్పాట్‌లను త్వరగా వేరుచేయాలని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్-19 కేసులను ముందస్తుగా గుర్తించడంలో సహాయపడటానికి RT-PCR టెస్ట్‌లను పెంచడం.. ట్రేసింగ్‌ పై ఫోకస్‌ పెట్టాలని పేర్కొంది.. మరోవైపు.. ఏ పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని.. సహాయక చర్యల్లో జాప్యం జరగకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తగినన్ని ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండటం చాలా అవసరం అని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో, శిక్షణ పొందిన మానవ వనరులు, మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా మరియు బలోపేతం చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.

Exit mobile version