కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రానేలేదు.. అప్పుడే.. థర్డ్ వేవ్ ప్రారంభమైపోయిదంటూ ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరిస్తోంది.. అయితే, కోవిడ్ మూడో ఉద్ధృతి సూచనలు కనిపిస్తుండడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మెరుగైన కోవిడ్ చికిత్సలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. భారత కొవిడ్-19 క్విక్ రెస్పాన్స్, ఆరోగ్య వ్యవస్థల సన్నద్ధత ప్యాకేజీ రెండో దశలో భాగంగా… 15 శాతం నిధులు అంటే 18 వందల 27 కోట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసింది. రాష్ట్రాలకు కేటాయించిన నిధుల వాటా వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ట్విటర్ ఖాతాలో ఉంచారు. ఇందులో యూపీకి అత్యధికంగా 281.98 కోట్లు కేటాయించారు. బిహార్‌కు 154 కోట్లు, రాజస్థాన్‌కు 132 కోట్లు, మధ్యప్రదేశ్‌కు 131 కోట్లు విడుదల చేశారు. తెలంగాణకు 44 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 62 కోట్లు కేటాయించారు.
ఈ ఫండ్‌ను ఆయా రాష్ట్రాలు.. కోవిడ్ పరీక్షల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవడం, బాధితులను వేరుగా ఉంచేలా కమ్యూనిటీ ఐసోలేషన్ కేంద్రాలు, కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. డివిజన్ స్థాయిలోని చికిత్స కేంద్రాల్లో పడకలు, పీపీఈ కిట్లు వంటి సామగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర ఔషధాలతో పాటు ఆక్సిజన్ లభ్యతను పెంచుకోవాలి. కొద్దిపాటి లక్షణాలున్న కొవిడ్ రోగులకు, ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఫోన్ ద్వారా సూచనలు అందించేందుకు… ఎంబీబీఎస్ చివరి సంవత్సరం, పీజీ వైద్య విద్యార్థుల సేవలను పొందవచ్చు. చివరి సంవత్సరం నర్సింగ్ గ్రాడ్యుయేట్ల పూర్తిస్థాయి సేవలను … ప్రభుత్వ చికిత్సా కేంద్రాల్లో వినియోగించుకోవచ్చు. ఇందుకు వారికి చెల్లించాల్సిన వేతనాలను, ఇన్సెంటివ్‌లను ఈసీఆర్‌పీ-2 నుంచి ఖర్చు చేయవచ్చు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్గదర్శకాల్లో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.. రాబోయే రెండు వారాల్లో 20 కోట్ల వరకు పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
