Site icon NTV Telugu

ఇక అలా కుదరదు..! వర్క్‌ ఫ్రమ్‌ హోంపై చట్టం..!

కరోనా మహమ్మారి వర్కింగ్‌ స్టైల్‌ను, విద్యావిధానాన్ని కూడా మార్చేసింది.. అంతా ఆన్‌లైన్‌కే పరిమితం అయ్యేలా చేసింది.. ఈ సమయంలో.. ఐటీ కంపెనీలతో పాటు.. చిన్న సంస్థలు కూడా కరోనా సమయంలో రిస్క్‌ ఎందుకంటూ.. తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇచ్చేశాయి.. కరోనా కేసులు తగ్గి కొంత సాధారణ పరిస్థితులు వచ్చినా.. ఐటీ కంపెనీలు ఇంకా వర్క్‌ఫ్రమ్‌ హోం కొనసాగిస్తూనే ఉన్నాయి.. అయితే, ఆ పేరుతో కంపెనీలు ఉద్యోగులను పిండేస్తున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఎలాగు ఇంటి దగ్గరే కదా ఉన్నారని.. ఎక్కువ గంటలు పనిచేయించడం ఒకటైతే.. మరోవైపు.. వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.. తప్పితే.. వారికి అవసరమైన కనీస వసతులు కూడా కలిపించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

Read Also: ఒమిక్రాన్‌ టెన్షన్‌.. ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక నిఘా..

దీంతో.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం నిబంధనలు రూపొందించేపనిలో పడిపోయింది కేంద్ర ప్రభుత్వం.. ముఖ్యంగా ఈ నిబంధనల్లో కచ్చితమైన పని గంటలను నిర్ణయించి అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. వర్క్‌ ఫ్రమ్‌ హోంలో ఉన్న ఉద్యోగులకు విద్యుత్తు, ఇంటర్నెట్‌, ఇంట్లో ఉపయోగించే ఆఫీస్‌ స్పేస్‌/ఫర్నిచర్‌కు కూడా సంబంధిత కంపెనీలు డబ్బులు చెల్లించేలా నిబంధనలను తీసుకువచ్చే ఆలోచనలో ఉంది కేంద్రం.. ఇక, చట్టంలో ఉండాల్సిన అంశాలను, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తాల మదింపు విధానాలను అధ్యయనం చేసేందుకు ఒక కన్సల్టెన్సీ సంస్థను నియమించేందుకు సిద్ధం అవుతోంది సర్కార్. కాగా, కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు కావాల్సిన ఫర్నిచర్‌, ల్యాప్‌టాప్‌, ఇంటర్నెట్‌ లాంటి సదుపాయాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.. అవి ఏవీ కల్పించకుండా.. ఉద్యోగులను పిండేస్తున్న సంస్థల నియంత్రణకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు.

Exit mobile version