ఏపీకి పోలవరం ప్రాజెక్టు అతి ముఖ్యమైనది అని అందరికీ తెలిసిన విషయమే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావడం లేదు. దీంతో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సోమవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. నిర్ణీత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పూర్తిపై రాజ్యసభలో టీడీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
Read Also: సోనూసూద్‌కు మరో షాక్.. నోటీసులు జారీ చేసిన అధికారులు
ఈ మేరకు 2022 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యం మాత్రమే కాకుండా కరోనా పరిస్థితుల వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోందని కేంద్రం వివరించింది. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తయ్యాయని… ఎప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73శాతం, పైలెట్ చానల్ పనులు 34శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర వెల్లడించారు.
