Site icon NTV Telugu

మరోసారి రికార్డు సృష్టించిన జీఎస్టీ వసూళ్లు

దేశంలో కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా పుంజుకుంటోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ నెలకు సంబంధించి కేంద్రం ప్రకటించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను చూస్తే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. అక్టోబరులో దేశవ్యాప్తంగా రూ.1,30,127 కోట్ల జీఎస్టీ వసూళ్లు వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రకటించారు. ఈ వసూళ్లలో సీజీఎస్టీ వసూళ్లు 23,861 కోట్లు కాగా ఎస్‌జీఎస్టీ వసూళ్లు 30,421 కోట్లు. ఐజీఎస్టీ కింద రూ.67,361 కోట్లు వచ్చాయి. సెస్ రూపంలో రూ.8,484 కోట్లు వచ్చినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ నెల వసూళ్లు 24 శాతం అధికంగా కాగా 2019 అక్టోబరుతో పోలిస్తే 36 శాతం ఎక్కువ.

Read Also: ఢిల్లీలో పెరిగిన ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం

మరోవైపు జీఎస్టీ విధానం ప్రవేశపెట్టిన తర్వాత అక్టోబర్ నెలలో వచ్చిన జీఎస్టీ వసూళ్లు రెండో అత్యధికమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.1.41 లక్షల కోట్లు నమోదు కాగా ఇప్పటివరకు అవే అత్యధికం. కాగా ఆర్థిక పునరుద్ధరణతో పాటు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి బయటపడి పెరుగుతున్న ఈ-పే బిల్లుల ధోరణికి ఈ వసూళ్లు దోహదపడుతున్నాయని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. ఈ రికార్డు వసూళ్లతో వరుసగా నాలుగో నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి.

Exit mobile version